mt_logo

కార్పొరేట్ రష్

హైదరాబాద్‌కు తరలివస్తున్న సంస్థలు.. ఆఫీస్ స్పేస్‌కు పెరుగుతున్న గిరాకీ..
జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల కార్యాలయాలకు మన హైదరాబాద్ వేదిక అవుతున్నది. నగరానికి తరలివచ్చేందుకు వివిధ కార్పొరేట్ సంస్థలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇవాళ దేశంలో అత్యధికంగా కార్పొరేట్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్న నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. కార్పొరేట్ కార్యకలాపాల తీరు తెన్నులను పరిశీలించే ఓ సంస్థ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

గతంలో కార్పొరేట్ సంస్థలన్నీ తమ కార్యాలయాలను దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మాత్రమే ఏర్పాటు చేస్తుండేవి. కొన్ని సంస్థలు ఢిల్లీ, పుణె, బెంగళూరును కూడా ఎంచుకునేవి. అయితే ఇది క్రమంగా మారి ఇతర ప్రాంతాలకు కార్యాలయాల విస్తరణ మొదలైంది. ఈ నేపథ్యంలో సమశీతోష్ణ స్థితితో కూడిన అనుకూల వాతావరణం, మెట్రోపాలిటన్ సంస్కృతి, శరవేగంతో జరుగుతున్న అభివృద్ధి, శాంతియుత వాతావరణం, పరిశ్రమలకు, వాణిజ్యానికి ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం ఉండడంతో ఆయా సంస్థలు మన నగరం నుంచే కార్యకలాపాలు సాగించేందుకు ముందుకొస్తున్నాయి. కార్యాలయాల ఏర్పాటులో దేశంలోనే మన నగరం మూడో స్థానంలో నిలవడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

సీ.డబ్ల్యూ సర్వే..
ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మొదటి మూడు త్రైమాసికాల్లో దేశంలోని వివిధ నగరాల్లో కార్పొరేటు ఆఫీసుల పెరుగుదల, ఆఫీసు స్పేస్ వినియోగంపై కుష్మన్ అండ్ వేక్‌ఫీల్డ్(సీ.డబ్ల్యూ)అనే సంస్థ సర్వే నిర్వహించింది. గత ఏడాదితో పోల్చుకుంటే మన దేశంలో 36 శాతం ఆఫీసు స్పేస్ వినియోగం పెరిగినట్లు తేలింది.

గత ఏడాది ఇదే సమయంలో దేశంలో మొత్తంలో 17.7 మిలియన్ల చదరపు అడుగులమేర కార్యాలయాల వినియోగం ఉండగా, ఇప్పుడది 24 మి.చ.అడుగులకు చేరుకుంది. దీన్నిబట్టి కార్పొరేటు కార్యాలయాలు మన దేశానికి క్యూ కట్టినట్టు స్పష్టమవుతోంది. అలాగే నగరాల విషయం తీసుకుంటే అహ్మదాబాద్, బెంగుళూరు తరువాత హైదరాబాద్‌లోనే ఎక్కువగా కార్పొరేటు కార్యాలయాలు ఏర్పాటవుతున్నట్లు సర్వేతో స్పష్టమైంది.

గత ఏడాదితో పోల్చుకుంటే అహ్మదాబాద్‌లో 219 శాతం కార్యాలయాల స్థల వినియోగం పెరగగా, బెంగళూరులో 92 శాతం, హైదరాబాద్‌లో 84 శాతం పెరుగుదల నమోదైంది. దీనికి భిన్నంగా పూణెలో 19 శాతం, కోల్‌కతాలో 26 శాతం ఆఫీసుల వినియోగం తగ్గుదల నమోదుకావడం విశేషం. అహ్మదాబాద్‌లో ఆఫీసు స్థలం వినియోగానికి ముఖ్యంగా సమాచార-సాంకేతిక రంగంతోపాటు బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, తయారీ రంగం వృద్ధి ప్రధాన కారణాలుగా నిలువగా, బెంగళూరు, హైదరాబాద్‌లతో ఐటీ రంగం వృద్ధి ప్రధాన కారణంగా నిలిచినట్లు సర్వేలో వెల్లడైంది.

బెంగళూరుతో హైదరాబాద్ పోటాపోటీ..
పారిశ్రామికాభివృద్ధిలో బెంగళూరు చాలాకాలంగా మనకు అందనంత దూరంలో ఉండేది. అక్కడ వాచీల ఉత్పత్తి ప్రారంభమై పాతబడ్డాక గాని ఇక్కడ ఆల్విన్ వాచీలు రాలేదు. ఐటీ రంగం అక్కడ వేళ్లూనుకున్న దశాబ్దం తర్వాత కాని హైదరాబాద్‌కు పరిచయం కాలేదు. ఐటీ రంగంలో బెంగళూరు హవాను దేశంలో అనేక నగరాలు తట్టుకోలేని పరిస్థితే నిన్నమొన్నటిదాకా ఉండేది. కానీ తాజా వివరాల ప్రకారం కార్పొరేట్ రంగంలో కర్ణాటకతో హైదరాబాద్ పోటాపోటీగా ఉంది. ఆఫీస్‌ స్పేస్ విషయంలో కేవలం 8 శాతం తేడా మాత్రమే వచ్చింది. కాగా నిన్న మొన్న ప్రకటించిన పారిశ్రామిక పాలసీ, ఐటీఐఆర్ రాకడ నేపథ్యంలో హైదరాబాద్ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో ప్రత్యేకంగా చెప్పే పనిలేదు.

ఐటీఐఆర్ ఆకర్షణ…
నగరానికి ఐటీఐఆర్ ప్రాజక్టు మంజూరుకావడంతో ప్రముఖ ఐటీ సంస్థలతోపాటు వాటి అనుబంధ ఉత్పాదక సంస్థలు మన నగరంవైపు క్యూ కడుతున్నట్లు మార్కెట్ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతంలో ఇప్పటికే ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటుచేయగా, ఇప్పుడు నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్ సంస్థ ఈస్ట్‌జోన్ వరంగల్ రహదారి వైపు అత్యంత భారీస్థాయిలో సంస్థను ఏర్పాటు చేసింది. ఆ కారిడార్‌లో ఇంకా ఖాళీ జాగాలు తక్కువ ధరకే లభ్యమయ్యే అవకాశం ఉండడంతో కొత్తగా వచ్చే సంస్థలు ఈస్ట్‌ జోన్‌వైపు దృష్టి కేంద్రీకరించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర సర్కారు నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడంతో ఇకముందు మరిన్ని సంస్థలు నగరానికి వచ్చే వీలుందన్నది వారి అభిప్రాయం.

వాణిజ్యాభివృద్ధికి సూచిక..
కాగా ఆఫీసు స్పేస్ వినియోగం ఆర్థికాభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాల పెరుగుదలకు కొలమానంగా చెప్పవచ్చు. కొత్తగా కార్పొరేటు సంస్థల రాక, ఇప్పటికే ముంబాయి, ఢిల్లీ వంటి నగరాల్లో ఉన్న తమ సంస్థలను ఇతర నగరాలకు విస్తరించే క్రమంలో భాగంగా అహ్మదాబాద్, బెంగుళూరులతోపాటు మన నగరానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు సర్వేను బట్టి స్పష్టమవుతోంది. అంతేకాకుండా కొన్ని సంస్థలు ఇతర నగరాల్లోని తమ కార్యాలయాలను ఎత్తివేసి ఇక్కడకు తరలించినట్లు కూడా సర్వేలో తేలింది. ఇదే ఒరవడి వచ్చే రెండేళ్లు కొనసాగే అవకాశముందని సీ.ఇబ్ల్యూ సౌత్ ఏషియా మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ దత్ అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

స్థాయి పెరిగిన ఇంజినీరింగ్ కాలేజీలు..
నగరంలోని ఇంజినీరింగ్ కాలేజీలు జాతీయ ప్రమాణాలు అందుకుంటున్నాయి. ఓ వైపు ఇక్కడ నైపుణ్యం కలిగిన మానవ వనరులు దొరకడం లేదనే ఒక అభిప్రాయం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో టాప్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఆఫ్ ఇండియా-2014కు ఓ సంస్థ ఎంపిక చేసిన దేశంలోని అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన కళాశాలల జాబితాలో రాష్ట్రంలోని ఆరు కళాశాలలు చోటు చేసుకున్నాయి.

కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్లు, పారిశ్రామిక అనుసంధానం, రీసెర్చ్ తదితర అంశాల ఆధారంగా నిర్దారించే ప్రమాణాల్లో 90-94 పర్సంటైల్‌తో ఏఏఏఏ ప్లస్(అవుట్ స్టాండింగ్) స్థాయి అందుకున్న 27 ఇంజినీరింగ్ కాలేజీల్లో వరంగల్ నిట్, జేఎన్‌టీయూ -హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ- హైదరాబాద్, ఐఐటీ- హైదరాబాద్ చోటు దక్కించుకున్నాయి. అలాగే ఏఏఏఏ (వెరీగుడ్ 80-89 పర్సంటైల్‌తో) స్థాయి అందుకున్న 56 కాలేజీల్లో ఉస్మానియా -హైదరాబాద్, బిట్స్ పిలానీ-హైదరాబాద్ చోటు చేసుకున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి ఇది శుభసూచకంగా భావించవచ్చు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *