mt_logo

సోలార్ ద్వారా 2 వేల మెగావాట్ల ఉత్పత్తి!

రాబోయే ఐదేళ్ళలో అదనంగా 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రంలో మరో నాలుగు సోలార్ పార్కులను ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తుంది. ఛత్తీస్ గడ్ నుండి వెయ్యి మెగావాట్ల విద్యుత్ తో పాటు తెలంగాణ జెన్ కో కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఉన్నాయి. వీటితో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టులకు కూడా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. గట్టు మండలంలో ఏర్పాటు చేయనున్న వెయ్యి మెగావాట్ల సోలార్ పార్కును గత శుక్రవారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు సందర్శించగా, ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి పలువురు ఉన్నతాధికారులతో దీనికి సంబంధించి సమీక్ష నిర్వహించారు.

ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా గట్టు మండలంలో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యమున్న సోలార్ పార్కుకు ఆమోదం లభించింది. దీనితో పాటు రాష్ట్రంలో 2000 మెగావాట్ల సామర్ధ్యమున్న సోలార్ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రంగారెడ్డి జిల్లా బంటారం మండలం తొరిమామిడి గ్రామంలో 400 మెగావాట్లు, ఆదిలాబాద్ జిల్లా మావలవిల్ గ్రామంలో 1000 మెగావాట్లు, అదే జిల్లాలోని ఇంద్రవల్లి మండలం గట్టిపల్లి గ్రామంలో 200 మెగావాట్లు, పిప్పాల్ ధాని గ్రామంలో 500 మెగావాట్ల సోలార్ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *