గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుండి హైదరాబాద్ లో ఉన్న గాంధీ, ఉస్మానియాలాంటి దవాఖానల వరకు అన్ని ఆస్పత్రులను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కార్పొరేట్ దవాఖానలకు ధీటుగా వీటిని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. బుధవారం తనను కలిసిన వైద్యుల బృందంతో సీఎం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కష్టపడి పనిచేస్తే ప్రైవేట్ కన్నా ప్రభుత్వ వైద్యశాలలే మిన్నగా ఉంటాయన్న పరిస్థితిని రాష్ట్రంలో కలిగించవచ్చని, రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానలను అభివృద్ధి చేసి పేదలకు వైద్యం అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని, అందుకు ప్రభుత్వ వైద్యులు సహకరించాలని సీఎం కోరారు.
అనంతరం వైద్యుల సంఘం నేతలు వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు ఇతర అంశాలపై సీఎంకు విజ్ఞాపన పత్రం అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు పట్టణ, నగర ప్రాంతాల్లో పనిచేసే వారితో పోలిస్తే తక్కువ హెచ్ఆర్ఏ వస్తున్నదని, ఇదేకాకుండా వేరే ఇతర సమస్యలు కూడా ఉన్నాయని, అందుకే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందని సీఎం కేసీఆర్ వారితో చెప్పారు. అంతేకాకుండా బడ్జెట్ లో ఎక్కువ నిధులు వైద్యరంగానికే కేటాయిస్తున్న విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఛాతీ ఆస్పత్రి నగరం మధ్యలో ఉండటంతో రోగులకు ప్రశాంతమైన వాతావరణం కరువైందని, కాలుష్యం వల్ల క్షయ వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారనే ప్రభుత్వ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నామని, ఈ ఆస్పత్రిని వికారాబాద్ కు తరలించే విషయంలో ప్రభుత్వానికి తమనుండి పూర్తి సహకారం ఉంటుందని వైద్యుల సంఘం నేతలు హామీ ఇచ్చారు.