mt_logo

తెలంగాణేతరుల చేతిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం?

పక్క రాష్ట్రానికి చెందిన ఒక పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులకు ఇప్పటికీ విధేయుడిగా ఉంటున్నాడని సీఎం రేవంత్ రెడ్డిపై పలు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే సలహాదారులు నియామకం విషయంలో తెలంగాణేతరుల వైపే రేవంత్ మొగ్గు చూపిస్తున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

తాజాగా తెలంగాణ పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి సంస్థకి (టీజీ రెడ్కో) వైస్‌చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న ఉద్యమకారుడు జానయ్య స్థానంలో విజయవాడకు చెందిన వావిల్ల అనీలను నియమించారు. ఆమె డీఈ స్థాయి అధికారిణి. కేసీఆర్‌ హయాంలో రెడ్కో సహా విద్యుత్తు పంపిణీ, ఉత్పత్తి సంస్థల్లో శాఖల అధిపతులందరూ తెలంగాణవారే ఉండేవారు.

అంతకుముందే శాసనసభ సలహాదారుగా సూర్యదేవర ప్రసన్నకుమార్‌ని (ఈయన ఇప్పుడు ఏపీ అసెంబ్లీకి వెళ్లిపోయారు)  నియమించారు. నీటిపారుదల రంగ సలహాదారుగా ఏపీ మాజీ ప్రధానకార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ని నియమించారు. మరో సలహాదారుగా ఏపీ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి శ్రీనివాస రాజుని నియమించారు.

తెలంగాణేతరుడు, కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి మీడియా, సోషల్ మీడియా సేవలందించిన డెక్కన్ క్రానికల్ ఎడిటర్ శ్రీరాం కర్రీని మీడియా రాష్ట్ర మీడియా, సమాచార డైరక్టర్‌గా నియమించారు.

ఇవే కాదు.. పలు ముఖ్యమైన పోస్టింగులలోనూ ఇతర రాష్ట్రాల వారికే రేవంత్ ప్రాధాన్యత ఇస్తున్నాడని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా.. ప్రభుత్వ కీలక శాఖలను మొత్తం వేరే రాష్ట్రాల వారికే అప్పజెప్పారని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.

రాజకీయ పదవుల్లోనూ, కాంగ్రెస్ సోషల్ మీడియాలోనూ వేరే రాష్ట్రాల వారే హల్‌చల్ చేస్తున్నారని స్వయానా కాంగ్రెస్ వాళ్ళే దుయ్యబడుతున్నారు.. ఇటీవలే తెలంగాణేతరుడుని ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడిగా నియమించారని పెద్ద వివాదమయ్యింది.

రేవంత్ అమెరికా వెళ్ళినప్పుడు కూడా కాంగ్రెస్ ఎన్నారైలకు, తెలంగాణ ఉద్యమకారులకు, పక్క రాష్ట్రానికి చెందిన ఒక పార్టీ మద్దతుదారులు చేతిలో చేదు అనుభవం ఎదురైనా రేవంత్ నోరు విప్పలేదు.

‘ఆనాటి రోజులు’ తీసుకురావడం అంటే ఇదేనేమో అని సోషల్ మీడియాలో కొందరు సెటైర్లు వేస్తున్నారు.