9 నెలలుగా తెలంగాణలో విద్యాశాఖకు మంత్రి లేడు.. కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదు.. రాష్ట్రంలో ప్రతీకార పాలన సాగుతోంది అని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. 9 నెలలుగా తెలంగాణలో విద్యాశాఖకు మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం ఎప్పుడైనా సమీక్షా చేశారా.. విద్యా శాఖపైన సీఎంకి కనీస అవగాహన లేదు అని విమర్శించారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది.. విద్యార్థులకు యూనిఫామ్స్ లేవు, చలికాలం వస్తుంది ఉలన్ రగ్గులు లేవు, బూట్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదు.. రాష్ట్రంలో ప్రతీకార పాలన సాగుతోంది కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల ఫీజులు కట్టడం లేదని మెమోలు ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ గురుకులాల్లో పేద విద్యార్థులు ఎంబీబీఎస్, ఐఐటీలు సాధించాలని సెంటర్ ఆఫ్ ఎక్ససెలెన్స్ ఏర్పాటు చేశారు.. ఇప్పుడు వాటిని ఎత్తి వేసే కుట్ర జరుగుతోంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గెస్ట్ ఫ్యాకల్టీకి నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. వాళ్ళు ఉద్యోగాలు మానేసేలా ప్రభుత్వం కుట్రపన్నుతోంది. పేద విద్యార్థులంటే రేవంత్ రెడ్డికి ఎందుకు కోపం అని అడిగారు.
వెంటనే గురుకుల కాలేజీల గెస్ట్ ఫ్యాకల్టీకి జీతాలు చెల్లించాలి.. స్పోర్ట్స్ స్కూళ్లలో కూడా అధ్యాపకుల జీతాలు చెల్లించాలి.విద్యా భరోసా కింద ఒక్కో విద్యార్థికి రూ. 5 లక్షలు ఇస్తామన్నారు.. ఒక్క పైసా అయినా విడుదల చేశారా. కేసీఆర్ గురుకుల విద్యాలయాలు 250 నుండి 1000 వరకు పెంచారు.. దేశంలో రోల్ మోడల్‌గా గురుకులాలను తీర్చిదిద్దారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను విస్మరిస్తోంది అని దుయ్యబట్టారు.
గురుకులాల్లో అన్ని వర్గాల విద్యార్థులు విద్యను పొందుతున్నారు. అక్షయపాత్ర సంస్థను విద్యాలయాలకు అంటకట్టడం సరికాదు.. బ్రహ్మకుమారి, అక్షయ పాత్ర సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు మానుకోవాలి. పేద విద్యార్థుల మీద ప్రయోగాలు చేయకండి ధార్మిక సంస్థల ఆలోచనలను విద్యార్ధులకు బలవంతగా రుద్దొద్దు.. ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలి అని ప్రవీణ్ కుమార్ సూచించారు
ఖైదీల తిండి కోసం 83 రూపాయలు ఖర్చు చేస్తోంది.. కానీ విద్యార్ధుల తిండి కోసం 37 రూపాయలు ఖర్చు చేస్తోంది. అన్నమో రామచంద్ర అంటూ సగం పొట్టతో గురుకులాల్లో విద్యార్థులు పస్తులు వుంటున్నారు. సీఎం రేవంత్ గురుకుల విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి.. గురుకులాల్లో పాముకాట్లకు గురై విద్యార్థులు చనిపోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో యూనివర్సటీలకు వీసీలు లేరు.. యూనివర్సిటీల నిర్వాహణ పై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని అన్నారు.
హైడ్రా అందరికి ఒకే న్యాయం పాటించాలి.పర్యావరణాన్ని కాపాడుకోవాలి కానీ పేదలకు ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయం వుండకూడదు. పేదలపైన వెంటనే యాక్షన్ తీసుకుంటున్న హైడ్రా.. దుర్గంచెరువులో తిరుపతి రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నించారు.
మహబూబ్‌నగర్‌లో అంధుల కాలనీలో అధికారులు ఇళ్ళు కూలుస్తున్నపుడు శిథిలాల్లో యూనిఫామ్ వేసుకున్న అమ్మాయి తన బుక్స్ వెతుక్కుంటోంది. ఈ దృశ్యం చూసి నాకు ఏడుపు వచ్చింది సీఎంకి ఎలా నిద్రపడుతోంది? 400 మంది పోలీసులతో అంధుల కాలనీ కూల్చారు కదా.. అంతే మంది పోలీసులు తిరుపతి రెడ్డి ఇంటికి వెళ్లి ఎందుకు కూల్చారు? అని ప్రవీణ్ కుమార్ అడిగారు.