-Courtesy: Katta Shekar Reddy
తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయంగా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం. అందరి పక్షాన నిలబడి అన్ని ప్రతికూలతలకు ఎదురొడ్డి తెలంగాణ తెచ్చినందుకు ఇప్పటికైతే ఆయనను మనసారా అభినందిద్దాం! వీలయితే ఆయన ప్రజల పక్షాన నిలబడేటట్టు చూద్దాం.!!
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తొలి ప్రకటన వెలువడ్డ 2009 డిసెంబర్9, రాత్రి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో సంబురాల్లో పాల్గొన్న నన్ను ఇంగ్లీష్ మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూ చేశారు. తెలంగాణకు స్వాతంత్ర్యం తెచ్చిన కేసీఆర్‌ను మీరు ఎలా చూస్తారని ఒక విలేకరి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఆయన మహాత్ముడని చెప్పాను. అంటే తెలంగాణ ప్రజలకు ఆయన మహాత్మాగాంధీ అంటారా! అని ఆ విలేకరి మళ్ళీ అడిగాడు. నాకు అవుననక తప్పలేదు. ఆ తర్వాత నా చుట్టూ ఉన్న మిత్రులు, లైవ్‌లో అది విన్నవాళ్ళు చాలామంది నన్ను నిజంగానే నువ్వు కేసీఆర్‌ను మహాత్ముడు అనగలవా? అని ప్రశ్నించారు. నేను చెప్పాల్సింది చెప్పాను. మహాత్ముడు అనేది పేరు కాదు.అదొక భారతరత్న లాంటి బిరుదు అంతకంటే కాదు. అశేష ప్రజావాహిని ఆకాంక్షలకు ప్రతినిధిగా ఉండి వాళ్ళ కలను నెరవేర్చిన వ్యక్తి ఎవరైనా సరే మహాత్ముడే అవుతాడన్నది నా అభిప్రాయం. కొందరు అంటున్నట్టు ఆయన కారణజన్ముడని, త్యాగధనుడని కీర్తించనవసరంలేదు. కానీ తెలంగాణ ప్రజలు, ఉద్యమం ఆయనను మహాత్ముణ్ణి చేసింది.
ఈ నేపథ్యంలో చాలా ప్రశ్నలు వస్తున్నాయి. వాటిలో ఒకటి ఒక్క కేసీఆర్ పోరాడితేనే తెలంగాణ వచ్చిందా? అన్నది. తెలంగాణ ఉద్యమంలో మిగతా ఎవరికీ అందులో పాత్ర లేదా? అంటే ఉంది. దేశానికి కూడా స్వాతంత్య్రం ఒక్క గాంధీ పోరాడితేనే రాలేదు. మిగతావారికెవరికీ రానంత ఖ్యాతి ఒక్క గాంధీకే ఎందుకు వచ్చిందీ అంటే ఆయన ఒకే పద్ధతిలో, ఒకే సిద్ధాంతంతో అప్పటి పాలకులు, చట్టాలు అనుమతించే రీతిలో పోరాడారు. నిజానికి గాంధీని మహాత్ముడు అన్నది స్వాతంత్ర్యం తెచ్చినందుకు కాదు. ఆయనను 1915లో సబర్మతి ఆశ్రమం ప్రారంభించినప్పుడు తన గుజరాతీ అనుచరుడు అలా పిలిచారు. జన బాహుళ్యానికి ఆత్మతప్తిని మిగిల్చిన ఎవరినైనా సరే మహాత్ముడు అనడానికి మొహమాటం ఎందుకు? పైగా యావత్ ప్రజానీకం ఎలుగెత్తి నీరాజనాలు పలుకుతున్నప్పుడు శషభిషలు దేనికి?
ఒక్క కేసీఆర్ పోరాడితేనే తెలంగాణ రాలేదు. అనేక త్యాగాలు, పోరాట సంస్థలు, వ్యక్తులు ఈ అన్నిటినీ ఉద్యమంగా మలిచి నిలబెట్టింది ఎవరో కూడా ఆలోచిద్దాం. స్వాతంత్రోద్యమం గాంధీ ఒక్కరే నిర్మించలేదు. ఇంకో రకంగా గాంధీ పుట్టడానికి పదేళ్ల ముందే మొదటి స్వాతంత్య్ర సంగ్రామం జరిగింది. గాంధీ ఉద్యమమార్గం ప్రజలను ఆకట్టుకుంది. ఆయన వేషం, భాష, ఉత్తర దక్షిణ కోణాలను కలిపాయి. ఇవన్నీ ప్రజల్లో చాలామందికి ఆమోదయోగ్యం అయ్యాయి. తెలంగాణ ఉద్యమం కూడా కేసీఆర్ నిర్మించిందేమీ కాదు, ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ ఒక్కరే పోరాడితే వచ్చింది కూడా కాదు. అరవై దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్న స్పృహను ఆయన తట్టిలేపారు. గతంలో కూడా చెన్నారెడ్డి మొదలు చిన్నారెడ్డి దాకా అనేకమంది అలాగే తట్టి లేపారు. కానీ వాళ్ళెవరూ ఉద్యమస్ఫూర్తిని నిలబెట్టలేకపోయారు. వాళ్లూ నిలబడలేకపోయారు. నిజానికి 1969 ఉద్యమం నిలబడి ఉండాల్సింది. అప్పటి ఉద్యమం వీరోచితం. కానీ పరిమితం. కొందరు విద్యావంతులు, యువకులు, ఉద్యోగులు నగరాల్లో పట్టణాల్లో మొదలుపెట్టిన ఉద్యమం గ్రామాలను తాకలేదు. కానీ ఇప్పుడు అలాకాదు.
తెలంగాణ జెండాలేని గ్రామం లేదు. కేసీఆర్ పేరు వినని గడపలేదు. ఇదంతా ఆయన రాజకీయ చతురతతో సాధ్యమయ్యింది. ఎదుటివారు ఎంతటి వారైనా తనవైపు తిప్పుకోగల నేర్పరితనం ఆయనది. ఆ నేర్పు వల్లనే ఆయన కాంగ్రెస్‌ను(2004)లో, టీడీపీని (2009) లో తనవైపు తిప్పుకోగలిగారు. ఆయా పార్టీల ఓటర్లనూ తనకు అనుకూలంగా మార్చుకోగలిగారు. కేవలం పార్లమెంటరీ పార్టీలే కాదు ఉద్యమ సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు, ముఖ్యంగా విద్యార్థులు ఇట్లా తెలంగాణ పౌర సమాజం అంతా ఏదో ఒక దశలో కేసీఆర్‌ను అనుకరించడమో కుదిరితే అనుసరించడమో చేసిన వాళ్ళే. కేసీఆర్ కంటే ముందునుంచి పనిచేస్తున్న వివిధ సంఘాలు వేదికలు, వ్యక్తులు తమ వంతుగా భావజాలవ్యాప్తికి తోడ్పడ్డారు. కార్యాచరణకు దిగారు. అందులో ప్రొఫెసర్ జయశంకర్, కేశవరావు జాదవ్, బియ్యాల జనార్దన్‌రావు మొదలు అనేకమంది ప్రొఫెసర్లు ఉన్నారు. గద్దర్, విమలక్క, మందకష్ణ, ఆకుల భూమయ్య లాంటి ఎందరో ఉద్యమకారులు కూడా ఉన్నారు. కులసంఘాలు, ఇతర రాజకీయపక్షాలు ప్రత్యామ్నాయ వేదికలూ వచ్చాయి. అందరికంటే మిన్నగా కేసీఆర్ మొండితనాన్ని భరించి గడిచిన నాలుగేళ్ళు ఆయనతో నడిచి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం ఓర్పు, సహనంకూడా ఉన్నాయి. ఆయన సారథ్యంలో గ్రామగ్రామానా పౌరసమాజాన్ని రూపొందించిన జేఏసీ ఉంది.
ఈ అందరికీ ఆయనతో అనేక విభేదాలు ఉండవచ్చు. ఆయన పార్టీ పట్ల, వ్యవహార శైలి పట్ల అభ్యంతరాలు ఉండి ఉండవచ్చు. కానీ ఈ అందరూ ఏదో ఒక దశలో ఆయనతో ఏకీభవించిన వాళ్ళే. ఆయనతో కలిసి నడిచిన వాళ్ళే. అలాగే భిన్న సిద్ధాంత భావజాలాలు ఉన్న వాళ్ళను కూడా ఆయన ఒక చోటికి తేగలిగారు. కొన్ని నక్సలైటు పార్టీలను అనేక బూర్జువా పార్టీలతో కలిసి పనిచేసే పరిస్థితులు సృష్టించారు. ఇట్లా తెలంగాణ అస్తిత్వానికి కేంద్ర బిందువు కాగలిగారు. ఈ అన్నిటినీ మించిన మొండితనం కూడా ఆయనకే సొంతం. ఇవి చాలా మందికి నచ్చే గుణాలు. అందుకే కొందరు ఆయనను ఇప్పుడు గాంధీతో పోల్చుతున్నారు.గాంధీలోకూడా ఇలాంటి మొండితనం మంకుపట్టు ఉండేవని చరిత్రకారులు చెపుతుంటారు.
1969 మొదలు తెలంగాణ ఉద్యమం ఉత్థాన పతనాలు చూసింది. ఒక దశలో తెలంగాణ ఒక కలగానే మిగిలిపోతుందనే అంతా అనుకున్నారు. కానీ అదిప్పుడు ఊహకు అందని రీతిలో నిజమయ్యింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మనచేతిలో ఉన్న పనినే ఎప్పుడు చేయగలమో చెప్పలేం. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగే కాలం కాదిది. రాజకీయాల్లో అది ఊహించలేం కూడా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని పైకి ఎన్ని గంభీరమైన మాటలు చెప్పుకున్నా ఎప్పుడవుతుందో ఎవరూ సరిగ్గా ఊహించే సాహసం చేయలేదు. పార్లమెంటు ఉభయసభల్లో సాగిన ప్రహసనాన్ని ఊపిరిబిగపట్టి చూసినవాళ్లకైతే తెలంగాణ ఇక రాదేమో అనిపించింది. పెప్పర్‌పాటి రాజగోపాల్ అతని ఆత్మాహుతి దళం ఒకవైపు, వెంకయ్యనాయుడు అదృశ్య కూటమి ఇంకొకవైపు చివరి నిమిషం దాకా తెలంగాణ అంశాన్ని వీలయినంత వరకు అడ్డుకోవాలని, కుదరకపోతే సాగదీయాలనే చూశాయి. మొత్తానికి ఒక సంక్లిష్ట రాజకీయ పరిణామాల మధ్య తెలంగాణబిల్లుకు ఆమోదముద్ర పడింది. రాజకీయం ఇంతకంటే అనిశ్చిత స్థితిలో ఉన్నప్పుడు కేసీఆర్ ఢిల్లీ వెళ్ళారు.నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీ వెళుతున్నాను. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతాను అన్నారు. ఆ మాట అనడానికి ముమ్మాటికీ గుండె ధైర్యమో, మొండితనమో ఉండి తీరాలి. లేకపోతే ఈ కాలపు రాజకీయాలు తెలిసిన ఎవరూ అటువంటి శపథం చేయరు. ఆ రెండూ ఉండడం వల్లనే ఆయన అందరూ ఇక అసాధ్యం అని వదిలేసిన తెలంగాణ అంశాన్ని తలకెత్తుకున్నారు. ఎన్ని విమర్శలు, నిందలు, అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా తన రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు ఉపయోగించి ఉద్యమాన్ని కొనసాగించారు. చివరకు ఢిల్లీ తెలంగాణ ప్రజలకు మోకరిల్లేలా చేశారు. కేసీఆర్‌ను వ్యతిరేకించే వారైనా సరే ఇది కాదనలేని సత్యం.
తెలంగాణ ప్రకటన వచ్చి పదిరోజులు దాటినా ఎవరూ పెద్దగా సంబరాలు చేసుకున్నట్టు లేదు. కానీ కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి తెలంగాణకు తిరిగొచ్చిన రోజు నగరం తెలంగాణ నినాదాలతో మారుమోగింది. ఆయనను కారణ జన్ముడని, త్యాగధనుడని పార్టీ శ్రేణులు కీర్తిస్తున్నాయి. మరి కొందరు తెలంగాణ గాంధీ అంటున్నారు. ఈ లోగా ఆంధ్రా మీడియా తెరాస-కాంగ్రెస్ విలీనానికి తెరతీసింది. కూపీలు లాగి మరీ చర్చలు పెడుతోంది. ఆ చర్చల్లో రక్తి కట్టించే కొత్త ప్రశ్నలు వస్తున్నాయి.
దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానని అన్న కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి తానే ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తున్నాడని ఒకరంటే అలాంటప్పుడు ఆయన మహాత్మాగాంధీ ఎలా అవుతాడు మహాఅయితే రాహుల్‌గాంధీకి అనుచరుడు అవుతాడని ఇంకొకరు అంటున్నారు. గాంధీ స్వాతంత్య్రం తెచ్చాక ఎలాంటి అధికారం పదవీ ఆశించలేదు. ఆయన పిల్లలు, కుటుంబం ఎవరెవరో ఎక్కడున్నారో తెలియదు. అలాంటప్పుడు ఈ పోలికలు ఎందుకు అనేవాళ్ళూ ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్‌కు బిరుదులు ఇవ్వాల్సిన పనిలేదు. కానీ ఆయన ఒక చరిత్ర సృష్టించారు కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయంగా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం. అందరి పక్షాన నిలబడి అన్ని ప్రతికూలతలకు ఎదురొడ్డి తెలంగాణ తెచ్చినందుకు ఇప్పటికైతే ఆయనను మనసారా అభినందిద్దాం! వీలయితే ఆయన ప్రజల పక్షాన నిలబడేటట్టు చూద్దాం.!!