mt_logo

మౌన(మాట)దీక్ష చేసిన ఆఖరి కిరణం-కేటీఆర్

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన దీక్ష అట్టర్ ప్లాప్ అయ్యిందని, పట్టుమని పదిమంది కూడా దీక్షలో లేరని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. బ్రహ్మాస్త్రం ప్రయోగించానని చెప్పిన ఆయన ఢిల్లీ వెళ్లి మౌన దీక్ష పేరుతో దొంగ దీక్ష చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని విలేకరులతో మాట్లాడుతూ మండిపడ్డారు. మౌన దీక్ష పేరుకే అయినా సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ మాట్లాడుతూనే ఉన్న కిరణ్ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన సీఎంగా మిగిలిపోతాడని కిరణ్ కుమార్ రెడ్డిని దుయ్యబట్టారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న సీమాంధ్ర నాయకులను ప్రజలు క్షమించరని, ముగ్గురు బాబులూ ఢిల్లీచుట్టూ ప్రదక్షిణలు చేసి తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఆపలేరని, కొద్దిరోజుల్లో తెలంగాణ కల నెరవేరుతుందని స్పష్టం చేశారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్, సీఎం కిరణ్ కలిసి కుట్రలు పన్ని వ్యతిరేక తీర్మానం పెట్టినా జీవోఎం దానిని క్లియర్ చేసి రాష్ట్రపతి పంపిన బిల్లును మాత్రమే కేబినెట్ సమావేశంలో ప్రవేశపెడుతున్నదని వివరించారు. రాష్ట్రపతిని కలిసి 80 శాతం మంది సమైక్యంగా ఉండాలని కోరుతున్నారని చెప్పిన కిరణ్ రాష్ట్ర అసెంబ్లీలో 294 మంది ఎమ్మెల్యేలలో 80 శాతం మందితో సమైక్యం అనిపిస్తారా? అని ప్రశ్నించారు. ఏ పదవీ లేని వ్యక్తిని తీసుకువచ్చి సీఎం గా కూర్చోబెట్టడం కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టినట్లే అని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో దీక్షకు వెళుతున్న సీఎంను ఆడుకోవడానికి ప్రయత్నించిన తెలంగాణ మంత్రులను భద్రతా సిబ్బందితో నెట్టివేయడం, కనీసం మహిళా మంత్రులని కూడా చూడకుండా తోసివేయడం అతి దారుణమైన చర్యగా కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *