ఈ రోజు నుండీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో స్పీకర్ మీరాకుమార్ ఇటీవల మరణించిన ఎంపీలకు సభ తరపున సంతాపం తెలియచేసారు. కాసేపవగానే సేవ్ ఆంధ్రప్రదేశ్ అని సీమాంధ్ర ఎంపీలు, జై తెలంగాణ అంటూ తెలంగాణ ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. ఎంతకీ వారు వినకపోవడంతో స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు. మరోపక్క రాజ్యసభలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవడంతో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సభను గంటపాటు వాయిదా వేశారు. మరోసారి ఇలా చేస్తే సభ్యులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. గంట తర్వాత ఉభయ సభలూ ప్రారంభమైనా రెండు ప్రాంతాల సభ్యులు నినాదాలతో సభలో ఆందోళన చేస్తుండటంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజ్యసభను హమీద్ అన్సారీ 15 నిమిషాలపాటు మళ్ళీ వాయిదా వేశారు. లోక్ సభలో సీమాంధ్ర ఎంపీలు నినాదాలతో సభను సక్రమంగా నడవకుండా అడ్డుపడుతున్నా, ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ ఈశాన్య రాష్ట్రాల సమస్యల గురించి మాట్లాడారు. తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ నేతల్లోనే వేర్వేరు అభిప్రాయాలున్నాయని అన్నారు. సభలో ఆందోళన ఇంకా కొనసాగడం, సభ జరిగే పరిస్థితి లేకపోవడంతో సభను మీరాకుమార్ రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభం కాగానే మతహింస బిల్లును కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రవేశపెట్టారు. బిల్లుపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ సభ్యుడు వెంకయ్యనాయుడు సభ్యుల ఆందోళనల మధ్య బిల్లును ఎలా ప్రవేశపెడ్తారని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇరువురికీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను రాజ్యసభ వైస్ చైర్మన్ పీజే కురియన్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో మతహింస నిరోధక బిల్లుపై చర్చ కొనసాగింది. ఈ బిల్లును బీజేపీ, ఏఐడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, వామ పక్షాలు వ్యతిరేకించాయి. మతహింస నిరోధక బిల్లు రాష్ట్రాల హక్కులకు భంగం కలిగిస్తుందని బీజేపీ నేత అరుణ్ జైట్లీ అన్నారు. కాగా ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ స్పందిస్తూ, మతహింస నిరోధక బిల్లు సమైక్య స్పూర్తికి ఇబ్బంది కలిగించదని, రాష్ట్రాల హక్కులకు భంగం కలగదని పేర్కొన్నారు. మతహింసలు చెలరేగినప్పుడు మాత్రమే రాష్ట్రాల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు. అయినా విపక్ష సభ్యులు వినకపోవడంతో సభను కురియన్ రేపటికి వాయిదా వేశారు.