త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీకి సీఎం హామీ

  • November 12, 2021 11:38 am

రాష్ట్రంలో నూతన జోనల్‌ వ్యవస్థలో ఉద్యోగుల సర్దుబాటు తర్వాత భారీస్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని టీజీవో అధ్యక్షురాలు మమత తెలిపారు. టీజీవో వ్యవస్థాపక అధ్యక్షుడు, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నేతృత్వంలో ఉద్యోగుల సంఘం ప్రతినిధుల బృందం గురువారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిసింది. అనంతరం టీజీవో అధ్యక్షురాలు మమత మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి ఉత్తర్వుల జాప్యంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల ప్రక్రియ ఆలస్యమైందని సీఎం అన్నట్టు తెలిపారు. మరింత జాప్యం జరగకుండా ఉద్యోగులు సర్దుబాటు ప్రక్రియలో సహకరించాలని సీఎం కోరినట్టు చెప్పారు. ఉద్యోగాల భర్తీ క్రమంలో ముందుగా కొత్త జిల్లాలకు ఆప్షన్లు తీసుకొని సీనియారిటీ ప్రాతిపదికన వారిని ఆయా జిల్లాలకు కేటాయిస్తారని, అనంతరం ఏర్పడే ఖాళీలను రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేస్తారని మమత వెల్లడించారు. ఉద్యోగుల డీఏ బకాయిలు త్వరలోనే విడుదల చేస్తామని సీఎం చెప్పారని మీడియాకు వివరించారు. సీఎంను కలిసినవారిలో టీజీవో నేతలు ఎస్‌ సహదేవ్‌, కృష్ణయాదవ్‌ తదితరులున్నారు.


Connect with us

Videos

MORE