mt_logo

పొలాల్లోకి వెళ్లి రైతులతో మాటామంతి జరిపిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం జోగులాంబ గద్వాలలో ఇటీవల మరణించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగివెళ్తూ మార్గమధ్యంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్‌, కొత్తకోట మండలం విలియంకొండ తండా పరిధిలో రైతులు సాగుచేసిన మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. మొదట రంగాపూర్‌ వద్ద ఆగి, మహేశ్వర్‌రెడ్డి అనే రైతు సాగుచేస్తున్న మినుము పంటను, రాములు అనే మరో రైతు సాగుచేస్తున్న వేరుశనగ పంటను పరిశీలించారు. రైతులతో కాసేపు ముచ్చటించారు. మినుములు, వేరుశనగ దిగుబడి ఎంత వస్తున్నది? మారెట్‌లో ధర ఎంత ఉన్నది? పంట చేతికొచ్చేవరకు ఎన్ని తడులు నీళ్లు పెడుతున్నరు? అని అడిగి తెలుసుకొన్నారు. ఆ తర్వాత కొత్తకోట మండలం విలియంకొండ తండా వద్ద కల్లంలో ఆరబోసిన వరి ధాన్యాన్ని సీఎం పరిశీలించారు. గోకరి వెంకటయ్య అనే రైతు వేసిన వేరుశనగ చేలోకి వెళ్లి పంటను పరిశీలించారు. వేరుశనగ దుబ్బును తెంపి కాయలను చిట్లించి చూశారు. నీళ్లు, కరెంటు పుషలంగా ఉండటంతో దిగుబడి పెరిగిందని రైతు వెంకటయ్య సీఎంకు వివరించారు. సీఎం కేసీఆర్‌ అకస్మాత్తుగా తమ పంట చేలల్లోకి రావడంతో రైతులు, గిరిజనులు ఆయనతో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా మారెట్లో డిమాండ్‌ ఉన్న పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని సీఎం ఆదేశించారు. సీఎం వెంట మం త్రులు శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *