యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులకు ఈనెల 30న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రిని తిరుపతిని తలపించేలా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు గవర్నర్ నరసింహన్, త్రిదండి చిన్నజీయర్ స్వామి పాల్గొంటారని తెలిసింది.
ఇదిలా ఉండగా రాష్ట్రం ఆవిర్భవించి సంవత్సరం కావస్తున్న సందర్భంగా ఈనెల 26న సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర మంత్రివర్గ కీలక సమావేశం జరగనుంది. అదేవిధంగా ఈనెల 29న ఉండాల్సిన సీఎం నల్గొండ జిల్లా పర్యటన జూన్ మొదటి వారానికి మార్చబడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉష్ణోగ్రతలు, వీస్తున్న వడగాలులతో ప్రజలకు, అధికారులకు ఇబ్బందులు ఎదురవుతాయని మంత్రి జగదీష్‌రెడ్డి సీఎం దృష్టికి తెచ్చారు. ఈ మేరకు జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రి పర్యటన ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా దామరచర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ భూమిపూజ, నక్కలగండి జలాశయానికి శంకుస్థాపన, చౌటుప్పల్‌లో జలహారం పైలాన్ ఆవిష్కరణలతో పాటు నకిరేకల్‌లో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.