mt_logo

ఘనమైన ఆరంభం..

By: కట్టా శేఖర్‌రెడ్డి

కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, తొలిసారి ముఖ్యమంత్రి, తొలిచూరు మంత్రివర్గం.. అంతా కొత్తకొత్త.. సగంసగం అధికార యంత్రాంగం.. పూర్తిగా విభజనకాని వ్యవస్థలు.. కేవలం పన్నెండు మాసాల వ్యవధి.. అయినా తెలంగాణ చాలా చాలా సాధించిందనే చెప్పాలి. తొలి తెలంగాణ ప్రభుత్వం తక్కువ వ్యవధిలోనే అయినా అత్యధిక తెలంగాణ ప్రజల ఆత్మలను స్పృశించిందనే చెప్పాలి. యాభయ్యారేళ్ల పరాయితనాన్ని అనుభవించిన తెలంగాణ ప్రజలకు, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు కేవలం పన్నెండు మాసాల్లోనే తెలంగాణతనాన్ని రుచి చూపించారు. మన నేతలు మన ఏలికలుగా ఉంటే ఆలోచించే ధోరణి, స్పందించే తత్వం ఎలా ఉంటుందో రుజువు చేశారు. తెలంగాణ ప్రభుత్వం గొప్ప గుణాత్మకమైన, దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగిన మార్పులకు పునాదులు వేసింది. విమర్శించేవారు ఎప్పుడూ ఉంటారు. వాళ్లెప్పుడూ ప్రతిపక్షమే. వాళ్లు మచ్చను మాత్రమే చూడగలరు.

చంద్రుడిని చూడలేరు. కేవలం వంకరగా ఆలోచించేవాళ్లు బుద్ధిజీవులు కాదు. వంద సమస్యలను పరిష్కరిస్తే వాళ్లు నూటా ఒకటో సమస్యను ముందుకు తెస్తారు. అది వాళ్ల తత్వం. కొందరు అక్కసు నుంచి, మరి కొందరు కసి నుంచి, ఇంకొందరు గిడసబారిన సిద్ధాంతాల కళ్లద్దాల నుంచి తీర్పులు ఇస్తుంటారు. తెలంగాణ ప్రభుత్వం విమర్శలకు అతీతం కాదు, కానీ ఐదున్నర దశాబ్దాల పాపాలన్నీ పన్నెండు మాసాల్లోనే పరిష్కారమైపోవాలని శాసించడం ఉందే అది అన్యాయం. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం గుణాత్మకమైన మార్పులు తీసుకు వచ్చిందా?లేదా? తెలంగాణ ప్రజల హృదయాలను చేరుకున్నదా లేదా? తెలంగాణ సమగ్రాభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు ఆవిష్కరిస్తున్నదా లేదా? తెలంగాణ వ్యవసాయక సంక్షోభానికి కారణమైన సాగునీరు, తాగునీరు, విద్యుత్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి పునాదులు వేస్తున్నదా? లేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్నదేమిటో తెలుస్తుంది. ఈ పన్నెండు మాసాల్లో ఏం జరిగింది?

ప్రభుత్వ రంగానికి పెద్ద పీట
స్వరాష్ట్రంలో కేసీఆర్ ఒక కొత్త అధ్యాయానికి తెరతీశారు. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా విద్యుత్తు, వైద్య ఆరోగ్య రంగాలను పూర్తిగా ప్రైవేటు రంగాలకు వదిలేయడం గత రెండు దశాబ్దాలుగా చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వాలు అమలు చేస్తూ వచ్చిన విధానం. కేసీఆర్ దానిని రివర్సు చేశారు. విద్యుదుత్పత్తిని ప్రభుత్వ రంగంలోనే ఉత్పత్తి చేయాలన్న దృఢసంకల్పంతో ఆయన అడుగులు ముందుకు వేశారు. తెలంగాణ జెన్కో, ట్రాన్సోలను టెక్నోక్రాట్స్ చేతుల్లో పెట్టి పూర్తి స్వేచ్ఛనిచ్చి విద్యుత్ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. జైపూరు, భూపాలపల్లి, దామరచర్ల వంటి ప్రాజెక్టులు మునుపెన్నడూ లేని వేగంతో ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వరంగంలో ప్రాజెక్టులు(టీఎస్‌జెన్కో, ఎన్టీపీసీ), ప్రభుత్వరంగ సంస్థలకు కాంట్రాక్టులు(బీహెచ్‌ఈఎల్), ప్రభుత్వ రంగ సంస్థల(పీఎఫ్‌సీ, ఎల్‌ఐసీ) నుంచి రుణ సహాయం….అంతా జీ టూ జీ ప్రాతిపదికన విద్యుత్ ప్రాజెక్టులపై ప్రభుత్వం పనిచేస్తున్నది. అంతేకాదు విద్యుత్ సరఫరాలో గత యాభైయ్యేళ్లలో చేయలేని పనిని కేవలం ఈ పన్నెండు మాసాల వ్యవధిలో తెలంగాణ ప్రభుత్వం చేయగలిగింది. విద్యుత్ కోతలు లేని వేసవిని తెలంగాణకు పరిచయం చేసింది. పారిశ్రామిక వేత్తలు సైతం అబ్బురపోయేలా విద్యుత్‌ను అందించారు. ఈ వేసవిలో జనరేటర్లు, ఇన్వర్టర్ల బిజినెస్ గతంతో పోల్చితే 25 శాతం కూడా జరగలేదంటే విద్యుత్ సరఫరా ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అంతెందుకు ఈసారి ట్రాన్సుఫార్మర్లు కాలిపోవడం లేదు. కరెంటు మోటార్లు చెడిపోవడం లేదు.

రైతులపై చాలా భారం తగ్గిపోయింది అని నల్లగొండ జిల్లా తిప్పర్తి ప్రాంతానికి చెందిన ఒక అభ్యుదయ రైతు వ్యాఖ్యానించారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా కరెంటు ఉత్పత్తి చేసింది లేదు. అటువైపు నుంచి చంద్రబాబు సీలేరు, కృష్ణపట్నం విద్యుత్‌ను ఎగ్గొట్టారు. ఆంధ్రలోనేమో 24 గంటలు కరెంటు ఇస్తున్నట్టు ప్రకటించుకున్నాడు. సమైక్య రాష్ట్రంలో ఈ తెలివి తేటలన్నీ ఏమయ్యాయి? ప్రభుత్వాలు కరెంటు సరఫరాలో రైతులను ఎందుకు రాచి రంపాన పెట్టాయి? ఎందుకంటే ఆంధ్ర ఆధిపత్య నాయకత్వాలు తెలంగాణ రైతుల సమస్యను తమ సమస్యగా భావించలేదు. కేసీఆర్ తెలంగాణ ఆత్మతో తెలంగాణ సమస్యను చూశారు కాబట్టి దానిని పరిష్కరించేందుకు అంకితభావంతో పనిచేశారు. అధికారులు కూడా అంతే నిబద్ధతతో కృషి చేశారు.

ప్రభుత్వ వైద్యశాలలు, వైద్య కళాశాలల అభివృద్ధికి నిధులు కేటాయించక దశాబ్దం గడిచిపోయింది. వైద్యశాలలలో పరిస్థితులు క్షీణించడం వల్ల మెడికల్ సీట్లు ప్రతిఏటా రద్దు కావడం, మళ్లీ ఢిల్లీ దాకా మొత్తుకుని తెచ్చుకోవడం పరిపాటిగా మారింది. ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగాన్ని నాశనం పట్టించి, ప్రైవేటు వైద్యానికి పెద్ద పీట వేసే ఒక విధానపరమైన కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతూ వచ్చింది. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఉస్మానియా వైద్య కళాశాల సీట్లు రద్దు కావడం ఏమిటి? కేసీఆర్ ఈ రంగంలో కూడా గుణాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. వైద్యశాలలు, వైద్య కళాశాలలకు మునుపెన్నడూ లేని విధంగా పెద్ద మొత్తాల్లో నిధులు కేటాయించడమే కాకుండా వాటిని ఆధునీకరించడానికి అవసరమైన అన్నిరకాల సహకారం అందించడానికి చర్యలు తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక పెద్ద వైద్యశాలను అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రపంచంలో దేనినైనా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నవాళ్లకు ఇవేవీ కనిపించకపోవచ్చు. కేసీఆర్ అందరు ముఖ్యమంత్రుల్లాగానే కనిపించవచ్చు. కానీ వీటి ఫలితాలు అనుభవించే ప్రజానీకానికి తెలుస్తుంది అప్పటికీ ఇప్పటికీ మార్పు ఏమిటో.

హైదరాబాద్‌పై విశ్వాస పునరుద్ధరణ
విడిపోతే హైదరాబాద్ సర్వం నాశనం అయిపోతుందని, తెలంగాణ అంధకారం అయిపోతుందని, పరిశ్రమలు తరలిపోతాయని, తెలంగాణవాళ్లు చందాలు, దందాలు చేసి పారిశ్రామిక వర్గాలను చెదరగొడతారని ప్రచారం చేసినవాళ్లు ఇప్పుడు నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఉద్యమం సందర్భంగా హైదరాబాద్‌లో కొంత అశాంతి నెలకొన్న మాట వాస్తవమే. అది కూడా సీమాంధ్ర మీడియా చేసిన ప్రచారం వల్లనే పారిశ్రామిక వర్గాలు ఎక్కువగా భయపడ్డాయి. కేసీఆర్ ప్రభుత్వం ఈ అపనమ్మకాలను అత్యంత వేగంగా తొలగించగలిగింది. ఐటీ, పారిశ్రామిక వర్గాల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో కేసీఆర్, ప్రత్యేకంగా కేటీఆర్ చేసిన ప్రయత్నం అసాధారణం. నిరంతర విద్యుత్‌ను ఇవ్వడమే కాకుండా, శాంతిభద్రతల నిర్వహణ, బాధ్యతాయుత పాలన, దేశంలోనే ఎక్కడా లేని ఒక కొత్త డైనమిక్ పారిశ్రామిక విధానం రూపొందించడం ఇవన్నీ పారిశ్రామిక వర్గాల విశ్వాసాన్ని చూరగొన్నాయి. హైదరాబాద్ తిరిగి గ్లోబల్ మార్కెట్ చిత్రపటంలో ప్రధాన స్థానాన్ని సంపాదించుకుంది. ఉత్తమ నగరాల్లో ఒకటిగా మన్నన పొందింది. హైదరాబాద్‌ను బ్రాండింగ్ చేయడంలో ముఖ్యమంత్రి కూడా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం విజయం సాధించాలంటే హైదరాబాద్ విజయం సాధించాలి. ట్రాఫిక్, శాంతిభద్రతలు, రోడ్లు, పారిశుధ్యం, నాణ్యమైన తాగునీరు వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టిని సారించింది. అంతర్జాతీయ నగరాల ప్రమాణాలతో హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి పట్టుదలగా పనిచేసుకుపోతున్నారు. ప్రభుత్వం కల్పించిన ధీమా పర్యవసానంగా ఇప్పుడు పలు అంతర్జాతీయ కంపెనీలు తిరిగి హైదరాబాద్ బాటపట్టాయి. తెలంగాణ వచ్చిన తర్వాత సుమారు 40కి పైగా చిన్నాపెద్ద సంస్థలు కొత్తగా తమ కంపెనీలను ప్రారంభించాయి. గూగుల్ వంటి అత్యంత ప్రతిష్ఠాకరమైన సంస్థ కాలిఫోర్నియా తర్వాత తన రెండో అతిపెద్ద బిజినెస్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో పారిశ్రామిక వేత్తలు కంఫర్టు ఫీలవుతున్నారు. చంద్రబాబు చుట్టూ ఉన్న షేడీ పారిశ్రామిక వేత్తలు కేసీఆర్ వద్ద లేరు. చాలా మంది ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, ఆంధ్రాప్రాంతం వారు సైతం ఆ షేడీ పారిశ్రామిక వేత్తలను దాటుకుని చంద్రబాబుతో వ్యవహారం చేయడం కష్టంగా ఫీలవుతున్నారు.

సంక్షేమంలో దేశానికే ఆదర్శం
సంక్షేమ రంగంలో అందరికీ అన్ని అన్న విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఎక్కడా రాజీపడడం లేదు. అమలులో సమస్యలు తప్ప విధానలోపం లేదు. పింఛన్లు అడిగినవారందరికీ ఇస్తున్నారు. పింఛను సొమ్ము ఐదు రెట్లు పెరిగింది. పించను లబ్ధిదారుల సంఖ్య మునుపటికంటే ఇరవై శాతం మంది పెరిగారు. బడిపిల్లలకు సన్నబియ్యం అన్నం పెడుతున్నారు. అంగన్‌వాడీలకు నాణ్యమైన సరుకులు అందిస్తున్నారు. సమైక్యప్రభుత్వాలు ఎగవేస్తూ వచ్చిన 2000 కోట్ల రూపాయలకుపైగా ఫీజు బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించింది. రైతులకు 18000 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఇందుకు గాను ఇప్పటివరకు 9000 కోట్లు బ్యాంకులకు చెల్లించింది. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు వందకోట్లు కేటాయించింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల ద్వారా పేద ఆడపిల్లల పెళ్లిల్లకు చేయూత నిస్తున్నది. దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేస్తున్నది. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చే ప్రక్రియ మొదలయింది. ఎస్‌టీ, ముస్లిం సంక్షేమంపై సిఫారసులు చేసేందుకు రెండు వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేసింది. జర్నలిస్టులందరికీ ప్రమాద బీమాను ప్రకటించింది. ఆరోగ్యబీమాను కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రంలోని డ్రైవర్లు, హోంగార్డులందరికీ ఉచిత ప్రమాద బీమా ఇవ్వడానికి దరఖాస్తులు స్వీకరించడం మొదలు పెట్టింది. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీలను ఇప్పించింది. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న మొక్కజొన్న, పసుపు, చెరకు రైతుల బకాయిలను విడుదల చేసింది. దళితుల ఇళ్ల కరెంటు బిల్లులను మాఫీ చేసి, ఆ సొమ్మును విద్యుత్ పంపిణీ కంపెనీలకు చెల్లించింది. ఒక్క సంక్షేమంపైనే 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.

థింక్ బిగ్, థింక్ డిఫరెంట్, యాక్ట్ బిగ్ అన్నది కేసీఆర్ అభిమతం. ఆయన ఈ ఏడాదిలో సాధించిన, యోచించిన, రూపొందించిన పథకాలు ప్రాజెక్టులు ఇంకా చాలానే ఉన్నాయి. ఆయనకు ఆరోగ్యం బాగోలేదని, ఏదో జరిగిపోతోందని ఒక వర్గం మీడియా, రాజకీయ నాయకులు కసికొద్దీ, ఉక్రోషం కొద్దీ ప్రచారం చేస్తూ వచ్చారు. అదంతా విష్‌ఫుల్ థింకింగ్. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న కాలంలో కూడా ఇటువంటి నీచనికృష్ట ప్రచారాలు జరిగాయి. కానీ ఆయన ఆ దుర్మార్గపు యుద్ధాలన్నింటినీ జయిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అంతే. ఆయన ఈ ఏడాదికాలంలో విశ్రాంతి తీసుకున్నది లేదు. వీలైనంత ఎక్కువగా జనం మధ్యనో, అధికారుల మధ్యనో ఉండడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. గంటలు గంటలు చర్చలు చేస్తున్నారు. అవిశ్రాంతంగా సమీక్షలు చేస్తున్నారు. అప్పుడప్పుడూ అధికారులు అలసిపోతున్నారు తప్ప, ఆయనలో అలసట లేదు. ఆరోగ్యం పాడయిన నాయకుడెవరూ అన్ని గంటలపాటు, ఇన్ని మాసాలపాటు ఇంత శ్రమకు నిలబడలేరని కామన్‌సెన్స్ ఉన్నవారెవరికయినా తెలుస్తుంది. కానీ ఉన్మాదం తలకెక్కిన వారికి కామన్‌సెన్స్ ఉండే అవకాశమే లేదు. కేసీఆర్ జయించారు. జయించారు. జయిస్తూనే ఉన్నారు. మరికొన్ని అంశాలు మరో వారం.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *