mt_logo

మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుకు డిసెంబర్ 9న శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్ 

హైదరాబాద్‌లో మెట్రో రైల్‌ రెండో దశ ప్రాజెక్టు నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ దశలో మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ వద్దగల రాయదుర్గం మెట్రో టర్మినల్‌ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైల్‌ మార్గాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. మెట్రో రైల్‌ రెండో దశ ప్రాజెక్టు నిర్మాణానికి ముహూర్తం ఖరారవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో నిర్మాణ పనులకు డిసెంబర్‌ 9న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారని తెలిపేందుకు సంతోషిస్తున్నానని అన్నారు. మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు రూ.6,250 కోట్ల అంచనా వ్యయంతో 31 కి.మీ. పొడవున రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) ఆధ్వరంలో చేపట్టే ఈ ప్రాజెక్టు మూడేండ్లలో పూర్తవుతుందని పేర్కొన్నారు. ఇది కాకుండా బీహెచ్‌ఈఎల్‌-లక్డీకాపూల్‌, నాగోల్‌-ఎల్బీనగర్‌ మధ్య మెట్రో విస్తరణ కోసం డీపీఆర్‌ను పంపి కేంద్రతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.

విశ్వనగరంగా మారిన హైదరాబాద్‌ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నగరంలోని ఏ మూల నుంచైనా శంషాబాద్‌ విమానాశ్రయానికి అతి తక్కువ సమయంలో చేరుకొనే లా ఈ ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. ఇప్పటికే ప్రపంచంలోని అన్ని ప్రముఖ నగరాల్లోని ఎయిర్‌పోర్టులను మెట్రో రైలుతో అనుసంధానించారు. శంషాబాద్‌ విమానాశ్రయాన్ని సైతం అత్యుత్తమ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెట్రోతో అనుసంధానించాలని, తద్వారా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెట్టాలని సీఎం కేసీఆర్‌ నిశ్చయించారు. దీనిలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే ఫ్లైఓవర్లు, లింక్‌ రోడ్లు, ఇతర రహదారి వ్యవస్థలను బలోపేతం చేస్తున్న విషయం విదితమే. వీటితోపాటు ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు కూడా పూర్తయితే హైదరాబాద్‌కు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నది.

మైండ్‌స్పేస్‌-శంషాబాద్‌ మెట్రో రైల్‌ మార్గం అందుబాటులోకి వస్తే ఆయా ప్రాంతాల ప్రజలతోపాటు వెస్ట్‌జోన్‌లోని ఐటీ కంపెనీల ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. మొత్తం 31 కి.మీ. పొడవైన ఈ ఎలివేటెడ్‌ మార్గంలో బయో డైవర్సిటీ జంక్షన్‌, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, టీఎస్‌ పోలీస్‌ అకాడమీ, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, ఎయిర్‌పోర్ట్‌ కార్గో, ఎయిర్‌పోర్ట్‌ టర్మినల్‌ వద్ద 8 స్టేషన్లను నిర్మించాలని ప్రతిపాదించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెంబడి గచ్చిబౌలి, హిమాయత్‌సాగర్‌ మీదుగా శంషాబాద్‌ వరకు ఈ మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ 2018-19లోనే రూపొందించింది.

మెట్రో రెండో దశలో మైండ్‌స్పేస్‌-శంషాబాద్‌ మార్గంతోపాటు బీహెచ్‌ఈఎల్‌-లక్డీకాపూల్‌, నాగోల్‌-ఎల్బీనగర్‌ మార్గాలను కూడా నిర్మించాలన్న ఆలోచన ఉన్నది. బీహెచ్‌ఈఎల్‌-లక్డీకాపూర్‌ మధ్య 26 కి.మీ. మార్గంలో 23 స్టేషన్లు, నాగోల్‌-ఎల్బీనగర్‌ మధ్య 5 కి. మీ. మార్గంలో 4 స్టేషన్లను నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ పనుల కోసం వచ్చే కేంద్ర బడ్జెట్‌లో రూ.8,453 కోట్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ గత నవంబర్‌లోనే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌కు లేఖ రాశారు. ఒకవేళ కేంద్రం నిధులు సమకూర్చకపోయినా మెట్రో విస్తరణ పనులు చేపడతామని ఇటీవల ఓ కార్యక్రమంలో కేటీఆర్‌ చె ప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రో రైల్‌ తొలిదశలో 69 కి.మీ. మేర 3 మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్గాల్లో రోజూ సుమారు 4 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *