mt_logo

నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. నీతి ఆయోగ్ సబ్ కమిటీ సమావేశంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో అమలుచేసే పథకాలపై సబ్ గ్రూప్ రూపొందించే తుది నివేదికను ప్రధాని నరేంద్రమోడీకి సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అందజేయనున్నారు. ఇదిలాఉండగా కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్రానికి కేటాయించే నిధుల పెంపు, ఎఫ్ఆర్ బీఎం పరిమితి పెంపుపై చర్చించే అవకాశం ఉంది. మంగళవారం జరగనున్న సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సబ్ గ్రూప్ సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొని కేంద్ర పథకాలలో కోత, ఎఫ్ఆర్ బీఎం పరిమితి పెంపు తదితర అంశాలపై చర్చించనున్నారు.

14వ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం గతంలో కేంద్రంలో రాష్ట్రాల పన్నుల వాటా 32 శాతం ఉన్నప్పుడు ఎక్కువ నిధులు రాగా, ప్రస్తుతం ఈ వాటాను 42 శాతానికి పెంచినా గతంలో వచ్చిన ఆదాయం కూడా రావడం లేదు. దీనివల్ల సుమారు రూ. 2,300 కోట్ల ఆదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం కోల్పోతోంది. తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని భావించిన సర్కార్ మిగులు బడ్జెట్ ఆధారంగా ఎఫ్ఆర్బీఎంను 3 నుండి 3.5 శాతానికి పెంచాలని కేంద్రాన్ని కోరనుంది. ఇదే అంశంపై సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియాకు కూడా వివరించనున్నారు. సబ్ గ్రూప్ ద్వారా నీతి ఆయోగ్ చైర్మన్ ఒక రికమెండేషన్ ను ప్రధాని మోడీకి అందజేసి ఈ అంశాన్ని అంగీకరించాలని కోరనున్నట్లు తెలిసింది. బుధవారం కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసిన అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *