mt_logo

నీ కళ్ళముందే పాలమూరు ప్రాజెక్టు కట్టి చూపిస్తా- సీఎం కేసీఆర్

గురువారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైలాన్ ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. సాయంత్రం మండల కేంద్రంలో జరిగిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి లేదంటూ ఏపీ మంత్రి దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలపై సీఎం నిప్పులు చెరిగారు. ప్రాజెక్టుకు అనుమతులు లేవనడం అర్థరహితం.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రోద్భలంతో దేవినేని ఉమ ప్రధానికి ఫిర్యాదు చేస్తానని సన్యాసిలా మాట్లాడుతున్నాడు.. మోడీ నీకే కాదు.. మాకూ ప్రధానే.. మోడీ నీలాంటి కుక్కల మాటలు విని పాలమూరు ప్రజలకు నీళ్ళు ఇవ్వొద్దంటాడా? అని ప్రశ్నించారు. పట్టిసీమ, పోతిరెడ్డిపాడులకు అనుమతులున్నాయా? ఎవరిని అడిగి కట్టారు? ఎవరు అడ్డుపడ్డా ప్రాజెక్టు ఆగదని, నాలుగేళ్ళలో ప్రాజెక్టు పూర్తిచేసి పాలమూరు రైతుల పాదాలు కడుగుతానని సీఎం తేల్చిచెప్పారు.

కోటిమంది చంద్రబాబులొచ్చినా, హరిహరబ్రహ్మాదులు దిగి వచ్చినా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపలేరని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కృష్ణా నదీ జలాలు ఎవడబ్బ సొత్తు కాదు.. అవి తెలంగాణ ప్రజల జన్మహక్కు.. నీ కళ్ళముందే పాలమూరు ప్రాజెక్టు కట్టి చూపిస్తా.. ప్రాజెక్టు దగ్గర కుర్చీ వేసుకుని పనులు చేయిస్తా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఎవరైతే తెలంగాణను వ్యతిరేకించారో వాళ్ళు ఇక్కడినుండి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందని, ఈ విషయాన్ని చంద్రబాబు, దేవినేని ఉమ గుర్తుంచుకోవాలన్నారు. పాలమూరు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేసే అదృష్టం తనకు వచ్చిందని, రూ. 35, 200 కోట్లతో ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. ఈ ప్రాజెక్టుతో మహబూబ్ నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు నీరందుతుందని, పరిహారం చెల్లించాకే ప్రాజెక్టు పనులు మొదలుపెడతామని, రానున్న మూడేళ్ళలో 70 శాతం పనులు పూర్తిచేస్తామని సీఎం స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *