mt_logo

చంద్రబాబుపై మండిపడ్డ తుమ్మల, తలసాని..

తెలంగాణ భవన్ లో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా పట్టుబడ్డ చంద్రబాబుపై వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తుమ్మల మాట్లాడుతూ చంద్రబాబు సెక్షన్ 8ను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నాడని, అడ్డంగా పట్టుబడ్డా కూడా అబద్దాలతో ప్రజలను పెడదారి పట్టించాలని చూస్తున్నాడని అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో మేము అవమానభారంతో కుంగిపోతుంటే మీరు మాత్రం ఎలాంటి సిగ్గు లేకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తెలుగుజాతి పరువు తీస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అంతం చూడటం కాదు.. ముందు నీ అంతం చూసుకో.. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు ఉంది చంద్రబాబు వ్యవహారం.. ఇప్పటికైనా హుందాగా వ్యవహరించి ముఖ్యమంత్రి పదవి గౌరవాన్ని తగ్గించొద్దని సూచించారు. దొంగా, పోలీస్ మధ్య జరుగుతున్న వ్యవహారంలో ప్రభుత్వాన్ని లాగొద్దని తుమ్మల అన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు సిల్లీగా మాట్లాడుతున్నాడని, ఈ కేసులో చంద్రబాబును ఎవరూ కాపాడలేరని, ఆయన ఫ్రస్ట్రేషన్ తో మాట్లడుతున్నాడని అన్నారు. చంద్రబాబుకు నీతి నిజాయితీ లేదని, ఊరికే ఫోన్ ట్యాపింగ్ అంటున్నాడే కానీ రేవంత్ రెడ్డిని పంపించలేదని మాత్రం చెప్పడం లేదని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్న చంద్రబాబు ఆయన మంత్రుల భద్రత కోసం ఏపీ నుండి పోలీసులను తెప్పించుకున్నారు.. కరెంట్, నీళ్ళు కూడా ఏపీ నుండి తెప్పించుకుంటారా? అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *