mt_logo

సామాజిక చైతన్యమూర్తి సావిత్రీబాయి ఫూలే : సీఎం కేసీఆర్ 

మహిళా హక్కులను సాధించడం ద్వారానే మానవ హక్కుల సాధన సంపూర్ణమవుతుందనే విశ్వాసంతో తన జీవితకాలం పోరాడుతూ, ఆ దిశగా భావజాలవ్యాప్తి కొనసాగించిన సామాజిక చైతన్యమూర్తి శ్రీమతి సావిత్రీబాయి ఫూలే అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా భారత జాతికి ఆ మహనీయురాలు అందించిన సామాజిక సమానత్వ జ్ఞానాన్ని, చారిత్రక కృషిని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. 

కుల, లింగ వివక్షలతో కూడిన విలువలు, మూఢ విశ్వాసాలతో కునారిల్లుతున్న నాటి సమాజాన్ని, సమ సమాజం దిశగా నడిపించేందుకు సావిత్రీబాయి ఫూలే తన జీవితాన్ని ధారపోసారని అన్నారు. ఈ క్రమంలో భర్త జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహం మహోన్నతమైనదని, నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీఎం అన్నారు.

బడుగు బలహీన వర్గాలు, మహిళల సమాన హక్కుల సాధన కోసం తాను ఎంచుకున్న మార్గంలో ఎన్నో ఛీత్కరింపులు అవమానాలు ఎదురైనా, మొక్కవోని దీక్షతో ప్రతిఘటిస్తూ సావిత్రీబాయి ముందుకు సాగారని అన్నారు. విధ్వేషాలకు వ్యతిరేకంగా తన ఆశయాల సాధన కోసం ధృఢ చిత్తంతో మహా సంకల్పంతో సావిత్రిబాయి పోరాడారని సీఎం కేసీఆర్ కీర్తించారు. 

సంఘసంస్కర్తగా, రచయిత్రిగా సామాజిక సంస్కరణలకై నడుం బిగించిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా దేశాభ్యున్నతికి సావిత్రీబాయి అందించిన స్ఫూర్తిని నేటితరం కొనసాగించాలని సీఎం పిలుపునిచ్చారు. భారత దేశ ప్రగతికి సామాజికాభ్యున్నతికి వారి ఆలోచనలు నేటికీ ఆచరణయోగ్యమైనవేనని తెలిపారు. జీవితపు చివరి క్షణం వరకు పీడిత ప్రజల సేవకోసమే అంకితమైన సావిత్రిభాయి ఫూలే సేవాతత్పరత, యావత్ భరతజాతికి ప్రాత:స్మరణీయమని తెలిపారు.

సావిత్రీబాయి ఫూలే స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని, మహిళల సమాన హక్కుల కోసం కృషి చేస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ దిశగా అనేక పథకాలను సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ, మహిళా సాధికారతను సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం, దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *