ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతోనే బంగారు తెలంగాణ సాధ్యమని, ప్రజలు, ఉద్యోగసంఘాల నుండి మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఒత్తిడి వచ్చిందని, కానీ ఉద్యోగులకు, ప్రభుత్వానికి వారధిగా ఉండాలని సీఎం కేసీఆర్ కోరడంతో వెనక్కు తగ్గానని తెలంగాణ ఎన్జీవో నేత దేవీప్రసాద్ అన్నారు. కాచిగూడ మున్నూరు కాపు సంఘం మ్యాడం అంజయ్య హాల్ లో జరిగిన రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సభ ఆదివారం జరిగింది. ఈ సభకు హాజరైన దేవీప్రసాద్ మాట్లాడుతూ, బంగారు తెలంగాణ నిర్మాణంలో హౌసింగ్ బోర్డు ఉద్యోగులు ప్రధాన పాత్ర పోషించాలని, అవినీతికి ఆస్కారం లేకుండా గృహ నిర్మాణంలో అసలైన లబ్ధిదారులకు లాభం ఉండేలా కృషి చేయాలని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం సీఐడీ చేత విచారణ జరిపించడాన్ని దేవీప్రసాద్ ప్రశంసించారు. అర్హత ఉన్నవారికి పక్కా గృహాలు అందించినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని, గత ప్రభుత్వాలు బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకంలో ఇళ్ళ మంజూరులో అనుసరించిన అసమర్థ విధానాల వల్ల అవకతవకలు జరిగాయని ఆరోపించారు. గృహనిర్మాణ కార్పొరేషన్ ను చక్కదిద్ది భవిష్యత్తులో ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగకుండా సీఎం కేసీఆర్ ముందుచూపుతో వ్యవహరిస్తున్నారని చెప్పారు.