mt_logo

ముగిసిన క్రెడాయ్ ప్రాపర్టీ షో..

ఈనెల 29 నుండి 31 వరకు హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగిన మూడురోజుల క్రెడాయ్ ప్రాపర్టీ షో విజయవంతమైంది. హైదరాబాద్ తో పాటు బెంగుళూరు, ముంబై లాంటి వివిధ నగరాలకు చెందిన 150 మంది బిల్డర్లు ప్రాపర్టీ షోలో పాల్గొని వినియోగదారులకు తమ ప్రాజెక్టుల గురించి వివరించారు. 29 వ తేదీ శుక్రవారం ఈ ప్రాపర్టీ షోను ప్రారంభించిన సీఎం కేసీఆర్ రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు పలు రాయితీలు కల్పించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరపరిధిలో రియల్, నిర్మాణ ప్రాజెక్టుల ప్రారంభానికి వసూలు చేస్తున్న నాలా పన్ను, వివిధ శాఖల నుండి ఎన్వోసీలు ఇవ్వడానికి బదులు సింగిల్ విండో పద్దతుల్లో అనుమతులు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించడం పట్ల బిల్డర్లలో ఆనందం వ్యక్తమవుతోంది.

ఆదివారం జరిగిన ప్రాపర్టీ షో ముగింపు సభలో భారీనీటిపారుదల శాఖామాత్యులు టీ హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరం దేశంలోనే పెట్టుబడులకు కేంద్రంగా మారుతుందని, గత పదేండ్లుగా రియల్ ఎస్టేట్ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొందని తెలిపారు. వచ్చే సంవత్సరానికల్లా రియల్ ఎస్టేట్ రంగానికి మంచిరోజులు రానున్నాయని, సామాన్యులకు అందుబాటులో ఇళ్ళ నిర్మాణం చేపట్టాలని బిల్డర్లకు సూచించారు. బిల్డర్ల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళామని, త్వరలో వాటికి పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, హైదరాబాద్ క్రెడాయ్ అధ్యక్షుడు జైవీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *