mt_logo

తెలంగాణ రైతు ఉసురు తీసింది చంద్రబాబే- హరీష్ రావు

రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ప్రస్తుతం పూర్తిగా మరుగుజ్జుగా మారిపోయాడని, వయసు మీదపడి ఆయనకు మతి తప్పిందని, అందుకే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నాడని మంత్రి హరీష్ రావు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పక్కన ఉన్నవాళ్ళు పచ్చగా ఉంటే బాబు ఓర్వలేడని, కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నాడన్నారు. టీడీపీ లేకపోతే కేసీఆర్ గొర్రెలు మేపుకునే వారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై హరీష్ మండిపడ్డారు. శుక్రవారం మెదక్ జిల్లా సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో జరిగిన విలేకరుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గొర్రెలు కాసుకోవడం నీచమా? అవమానకరమా? యాదవులు, కురుమల వృత్తిని కించపరిచిన చంద్రబాబు వెంటనే వారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

టీడీపీలో కేసీఆరే బాబుకన్నా సీనియర్ అని, ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ లో ఉన్నాడని, అప్పుడు కాంగ్రెస్ నుండి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయాడని హరీష్ గుర్తు చేశారు. ఆ తర్వాత రాజకీయంగా పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతోనే మామ పెట్టిన పార్టీలో దిక్కులేక చేరాడన్నారు. కేసీఆర్ 1982 లోనే టీడీపీలో చేరితే చంద్రబాబు ఏడాది తర్వాత 1983 లో టీడీపీలో చేరాడని చెప్పారు. కేసీఆర్ ఉన్నత వ్యవసాయ కుటుంబంలో పుట్టారు.. ఆయన పుట్టింది 3 ఎకరాల భవంతిలో.. మరి నీ సంగతేంటి చంద్రబాబూ? అని హరీష్ ప్రశ్నించారు. పుట్టిన ఇంటిని పాఠశాలకు, ఆస్తిని ఎస్సీ కార్పొరేషన్ కు ఇచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్.. నీకు అలాంటి చరిత్ర ఉందా? రెండు ఎకరాలున్న నీవు వేలకోట్లకు ఎలా పడగలెత్తావని సూటిగా ప్రశ్నించారు.

కేసీఆర్ మానవతావాది కాబట్టే విశాఖపట్నంలో తుఫాన్ వస్తే ఎవరూ కోరకముందే అక్కడికి ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ స్థంబాలు పంపించి మానవతాన్ని చాటుకున్నారని, నాగార్జునసాగర్ నీటి వివాదం తలెత్తినప్పుడు నీళ్ళను వాడుకునే హక్కు ఆంధ్రాకు లేదని స్వయంగా తానే అడ్డుకుంటే కేసీఆర్ పిలిచి వారించారని గుర్తు చేశారు. ఇక్కడివారైనా, ఆంధ్రా వారైనా అందరూ రైతులేనని నచ్చచెప్పి నీళ్ళిచ్చి అక్కడి వారి పంటలు కాపాడింది కేసీఆర్ అని హరీష్ చెప్పారు. తెలంగాణలో పంటలు ఎండిపోవాలని చంద్రబాబు కుట్రలు చేశాడని, తెలంగాణలో కరెంట్ సమస్యలతో రైతులు మరణిస్తున్నప్పుడు శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని కేంద్రానికి లేఖ రాసిన దుర్మార్గుడన్నారు. పార్లమెంట్ చట్టాలు, ఒప్పందాలను తుంగలో తొక్కి తెలంగాణకు కరెంట్ రాకుండా చేసి చంద్రబాబు రైతుల ఉసురు తీశాడని హరీష్ దుయ్యబట్టారు.

చంద్రబాబుకు వెయ్యినాలుకలని, మహబూబ్ నగర్ లో తెలంగాణ కోసం మొదటి లేఖ ఇచ్చింది నేనేనని అంటాడు.. గుంటూరు పోయి తెలంగాణ ఏర్పడకుండా చివరి నిమిషం దాకా ఆపింది తానేనని అంటాడు.. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు చేసినంత ద్రోహం మరెవ్వరూ చేయలేదన్నారు. ఉంటే సక్కగుండు.. కానీ తిన్నింటి వాసాలు లెక్కపెట్టకు.. విద్యుత్ ప్రాజెక్టులకు అడ్డుపడకు.. నీళ్ళు రాకుండా కుట్రలు చేయకు.. అని హరీష్ హెచ్చరించారు. చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటే ఎవరికీ అభ్యంతరం లేదని, ఇక్కడే ఉంటా నేను ఎక్కడికీ పోనని చంద్రబాబు పదేపదే అంటున్నాడని, ఇక్కడే ఉండు.. కానీ మా పక్కనే ఉంటూ మాకే గొయ్యి తీస్తే పొమ్మనక ఏమంటాం అని హరీష్ ప్రశ్నించారు.

ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపట్ల యాదవసంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదవులను, కులవృత్తిని దారుణంగా అవమానించారని తెలంగాణ విద్యార్థి నాయకుడు దూదిమెట్ల బాలరాజు యాదవ్ మండిపడ్డారు. చంద్రబాబు వెంటనే యాదవులకు క్షమాపణ చెప్పకపోతే యాదవుల చేతిలో చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశాల్లో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, చింతా ప్రభాకర్, బాబూ మోహన్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *