దేశంలో ఏ నాయకుడు రైతుల గురించి పట్టించుకోలేదని, దేశంలో మంచి జరగాలంటే మంచి ప్రభుత్వం రావాలని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అన్నారు. అల్లాదుర్గంలో కొద్దిసేపటి క్రితం జరిగిన జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు అనగానే ఆగమాగం కావొద్దని, ఎవరు ఏం చెప్పినా విని మంచి ఆలోచన చేయాలని, ఏం జరిగితే రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుందో మీమీ ఊర్లలో చర్చ చేయాలని సూచించారు. 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఐదేళ్ళ కిందట తెలంగాణ ఎట్ల ఉండే? ఇప్పుడెట్ల ఉంది? దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. మిషన్ భగీరథ పూర్తి కావొస్తుంది. తెలంగాణ రాష్ట్రం రాకపోతే.. టీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోతే రైతుబంధు, రైతు బీమా ఉండేవా అని సీఎం ప్రశ్నించారు.
రైతు బంధు కింద ఎకరానికి ఇకపై ఏడాదికి రూ. 10 వేలు ఇస్తామని, చిన్నా, పెద్దా తేడా లేకుండా రైతు బీమా అమలు చేస్తున్నామని అన్నారు. ఆందోల్ నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సింగూరు నీళ్ళిచ్చినం. నేను కూడా ఈ మట్టిలో పుట్టిన బిడ్డనే. ఆందోల్ నియోజకవర్గంలో ఎన్నిసార్లు పాదయాత్ర చేశానో ఇక్కడి ప్రజలకు తెలుసు. కరెంట్ సమస్య తీరింది. తాగునీటికి కొరత లేదు. జహీరాబాద్ నిమ్జ్ పూర్తయితే 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నియోజకవర్గంలో 7 లక్షల ఎకరాలకు కాళేశ్వరం నీళ్ళు వస్తాయి. సింగూరు మీద లిఫ్టులు పెట్టి జహీరాబాద్ లో లక్ష ఎకరాలు, నారాయణఖేడ్ లో లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.
కాంగ్రెస్, బీజేపీలు ఒకరినొకరు నిందించుకుంటున్నారు. ఒకరు చోర్ అంటే మరొకరు బడా చోర్ అంటున్నారు. నరేంద్రమోడీపై కూడా ప్రజలకు చాలా ఆశ ఉండే. కానీ ఆయన కూడా అట్టర్ ప్లాప్ అయ్యిండు. మాకు తెలంగాణ ప్రజలే బాస్ లు. వాళ్ళ అవసరాలే మా అజెండా అని అన్నారు. ఆందోల్ అసెంబ్లీ ఎన్నికల్లో యువ జర్నలిస్ట్ క్రాంతి కిరణ్ ను మీరు సంపూర్ణ మెజార్టీతో గెలిపించారని, ఆయనతో పాటు అందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారని సీఎం ప్రశంసించారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ సౌమ్యుడు. విద్యావంతుడు. వివాదాలకు పోయే వ్యక్తి కారు. అవినీతికి దూరంగా ఉండి కేంద్రంపై పోరాటం చేసే వ్యక్తి. బీబీ పాటిల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని, 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ ను గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.