mt_logo

భువనగిరిని అగ్రస్థానంలో ఉంచుతా..

ఐదేండ్లు ప్రజల మధ్య ఉన్నా.. ఎంతో అభివృద్ధి చేశా.. ఎయిమ్స్ తీసుకొచ్చాం. నల్లగొండను ముంచిన కోమటిరెడ్డి బ్రదర్స్ నాడు పులిచింతల వద్దన్నరు. కాంట్రాక్టు రాగానే దగ్గరుండి కట్టిచ్చిండ్రు. బత్తాయి మార్కెట్ తేలేక పోయిండ్రు. సీఎం కేసీఆర్ అండదండలతో విజయం సాధిస్తా..

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నా. రాష్ట్రంలో అగ్రభాగాన నిలుపుతా. రాష్ట్ర సాధనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ వెంట నడిచా. బంగారు తెలంగాణ సాధనకు ఆయన సూచనల మేరకు పనిచేస్తున్నా. స్వరాష్ట్రంలో విద్యా, వైద్య రంగాల్లో విశేషమైన ప్రగతిని సాధించింది. భువనగిరి నియోజకవర్గం విస్తరించి ఉన్న ఆరు జిల్లాల్లో మెడికల్ కళాశాలలు సాధించాం. యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎయిమ్స్ తీసుకువచ్చాం. కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించా. రహదారుల అభివృద్ధికి రూ.వేల కోట్లు తెచ్చా. యాదాద్రి అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. సీఎం కేసీఆర్ అండదండలు, దీవెనలతో భారీ మెజార్టీ సాధిస్తాం. కోమటిరెడ్డి బ్రదర్స్ నల్లగొండను నిలువునా ముంచిండ్రు. ఎన్నో ఏండ్లుగా నల్లగొండ ఎమ్మెల్యేగా పనిచేసి కార్పొరేషన్ స్థాయికి తీసుకురాలేక పోయారు. ఒక్క ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ జిల్లాకు రాకుండా చేశాడు. నాడు పులిచింతల వద్దన్నారు. వైఎస్ పులిచింతల నిర్మాణం పనుల కాంట్రాక్టు ఇవ్వగానే దగ్గరుండి ప్రాజెక్టును కట్టించారు. కాంట్రాక్టు రాలేదని థర్మల్‌పవర్ ప్రాజెక్టును అడ్డుకుంటానని ప్రకటించారు. ఇవన్నీ గమనించిన ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు. ఇక్కడ కూడా కోమటిరెడ్డికి అదే జరుగబోతున్నది అని చెప్తున్న. భువనగిరి పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌తో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ..

ఐదేండ్లలో మీరు చేసిన ప్రగతి గురించి చెప్తారా?
వైద్యవృత్తిలో ఉన్న నేను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చా. సీఎం కేసీఆర్ ఎంపీగా తనకు కల్పించిన అవకాశాన్ని నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలకు సేవలందించేందుకు అహర్నిశలు శ్రమించా. ఆర్భాటంలేకుండా నిబద్ధతతో అనుకున్న ప్రగతి సాధించా. హైదరాబాద్ నగర శివారు ప్రాంతం నుంచి మారుమూల గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించి ఉన్న భువనగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయగాలిగాను.

రహదారుల అభివృద్ధికి మీరుచేసిన కృషి ఏమిటి?
రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చా. 524 కిలోమీటర్ల జాతీయ రహదారులను కొత్తగా మంజూరు చేయించా. యాదాద్రి-వరంగల్ హైవేకు రూ.1,900 కోట్లు, యాదాద్రి ఓఆర్‌ఆర్‌కు రూ.400 కోట్లు, చర్ల-నకిరేకల్‌కు రూ.500 కోట్లు, భువనగిరి అండర్ పాస్‌కు రూ.18 కోట్లు, దుద్డెడ-జనగామ- సూర్యాపేటకు రూ.500 కోట్లు, ఓఆర్‌ఆర్- వలిగొండ – కొత్తగూడెంకు రూ. 800 కోట్లు, యాచారం-జగదేవ్‌పూర్ రీజినల్ రింగ్ రోడ్డుకు రూ.2,500 కోట్లు మంజూరు చేయించా. 20 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. ప్రజా సమస్యలు పరిష్కరించలేదు. అందుకే నల్లగొండ అన్నిరంగాల్లో వెనుకబడింది. దీనికి కారణం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే చెప్పక తప్పదు. 2014లో యాదాద్రిలో కేసీఆర్ అడుగుపెట్టిన తర్వాత భువనగిరి డివిజన్ ఎంతగా అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసు. నల్లగొండ కార్పొరేషన్ స్థాయికి చేర్చలేకపోయారు..? కారణం స్థానిక కాంగ్రెస్ నాయకత్వమే. నల్లగొండ పట్టణంలో అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయి. నిజామాబాద్, కరీంనగర్ జిల్లా కేంద్రాలు కార్పొరేషన్ స్థాయికి ఎదిగాయి. కానీ నల్లగొండ నేటికీ మున్సిపాలిటీగానే ఉన్నది. మున్సిపాలిటీలో తమ బినామీలతో పనులు చేయించి అడ్డగోలుగా బిల్లులు కాజేశారు. వందల కోట్ల కుంభకోణాలతో దివాళా తీయించారు. అభివృద్ధి నిరోధకులుగా మారారు. ఫలితంగా నల్లగొండను కార్పొరేషన్ స్థాయికి ఎదుగకుండా చేశారు.

కాంగ్రెస్ చేస్తున్న వాగ్దానాలపై మీరు ఎలా స్పందిస్తారు?
కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పచ్చి గజినీగా ప్రజలు భావిస్తున్నారు. ఇచ్చిన వాగ్దానాలన్నీ మరచిపోయి ఎప్పటికప్పుడు కొత్తకొత్త వాగ్దానాలు ఇస్తారు. నల్లగొండ నియోజకవర్గ ప్రజలను మోసం చేశారు. అబద్దాలు ఆడేవారిని ప్రజలు ఎక్కువ కాలం నమ్మరు. నల్లగొండ ప్రజలు కర్రుకాల్చి వాతపెడితే భువనగిరిలో తేలారు.

సీఎం కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు ఎలా ఉపయోగపడుతాయి?
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయానికి దోహదపడుతాయి. సీఎం కేసీఆర్ ఇచ్చే సూచనలు మాకు శ్రీరామ రక్ష. ఆయన అండదండలు, దీవెనలతో భారీ మెజార్టీ సాధిస్తాం. ఆయన మార్గదర్శకత్వంలోనే భువనగిరి నియోజకవర్గానికి ఎయిమ్స్ వంటి అత్యున్నతమైన వైద్యవిద్యాసంస్థలు తీసుకురాగలిగాం. దేశానికే తలమానికంగా యాదాద్రి దివ్యక్షేత్రం అభివృద్ధి జరుగుతున్నదంటే అదంతా సీఎం కేసీఆర్ దార్శనికత వల్లనే. దీనివల్ల నియోజకవర్గం అంతా అభివృద్ధిపథాన వేగంగా పయనిస్తుంది. కల్యాణలక్ష్మి, ఆసరా, కేసీఆర్ కిట్లు, రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ వంటి పథకాలు నియోజకవర్గ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేశాయి.

మీపైనా, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపైనా ప్రజావ్యతిరేకత ఉన్నదని మీ ప్రత్యర్థుల ఆరోపణలకు మీరేమంటారు?
ఆ అర్హతే వాళ్లకు లేదు. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు పనుల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. సొంత గ్రామమని చూడకుండా ప్రాజెక్టు పేరిట కోట్లు మింగారు. ప్రజలకు మొండిచేయి చూపారు. అవినీతికి మరిగిన జలగలు కోమటిరెడ్డి బ్రదర్స్ అని ప్రజలే అంటున్నరు. అంతేకాదు పులిచింతల కట్టనివ్వమన్నారు. బాంబులు పెట్టి పేల్చేస్తామన్నారు. రక్తంతో నుదుట సింధూరం దిద్దుకున్నారు. తీరా కాంట్రాక్టులు రాగానే కోటిరెడ్డి బ్రదర్స్ ప్రాజెక్టును దగ్గరుండి కట్టించారు. రూ.వేల కోట్లకు అమ్ముడుపోయారు. బాంబులు పెట్టి పేల్చేస్తామన్న నేతలు పక్కాగా ఆంధ్రా ప్రజలకు మూడోపంటకు నీళ్లిచ్చే ప్రాజెక్టును నిర్మించారు. పెద్ద డ్రామా ఆడారు. ప్రజలను కొట్టి, పోలీసులతో బెదిరించి పనులు జరిపించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు వాళ్లకు మేలుచేస్తున్నారో.. ఎవరు నిండా ముంచారో వాళ్లకు బాగా తెలుసు. ప్రజలు చైతన్యవంతులు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఫలాలు అందుకున్న వారు. కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధిచెప్తారు.

రైతుల పక్షపాతిని అని కోమటిరెడ్డి చెప్పుకుంటారు కదా దానిపై మీరేమంటారు?
ఈ మాట వింటేనే నవ్వొస్తుంది. రైతులు పుట్టెడు దుఃఖంతో ఉండటానికి ప్రధాన కారకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. పుట్టెడు కష్టాలు తెచ్చిన వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిల్చిపోతడు. నల్లగొండ చుట్టుపక్కలా బత్తాయి తోటల పెంపకం చేసే రైతులు ఎక్కువగా ఉంటారు. కనీసం బత్తాయి రైతుల కోసం బత్తాయి మార్కెట్‌ను కూడా ఏర్పాటు చేయించలేక పోయారు. పర్సెంటేజీలకు భయపడి కాంట్రాక్టర్లు కూడా వచ్చిన పనులు వదులుకునే పరిస్థితి కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో టీఆర్‌ఎస్ ఒక్క సీటు గెలిచినా రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నాడు. ఇప్పుడు ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు సభ్యత్వానికి రాజీనామా చేస్తానంటున్నాడు. మిర్యాలగూడలో టీఆర్‌ఎస్ అభ్యర్థి భాస్కర్‌రావు గెలిస్తే టీఆర్‌ఎస్ ఆఫీస్‌లో అటెండర్‌గా పనిచేస్తానన్నాడు. భాస్కర్‌రావు గెలిచాడు. మేము టీఆర్‌ఎస్ ఆఫీసులో అటెండర్ ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దీనిపై కోమటిరెడ్డి బ్రదర్స్ తేల్చుకోవాలి.

సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంపై మీ కామెంట్ ?
సోషల్ మీడియాలో వచ్చే కథనాలు కొంతమంది కావాలని చేస్తున్నవి. బహిరంగ చర్చకు వస్తే నిజానిజాలు తేలుతాయి. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని భువనగిరి ప్రజలు విశ్వసించరు. నేను ఐదేండ్లల్లో చేసిన అభివృద్ధితో ప్రజల వద్దకు వెళ్తున్నా. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అక్కడి ప్రజలను నిలువునా ముంచారు. భువనగిరిలో పోటీకి వచ్చారు. ఏం చేశారని ప్రజలు కోమటిరెడ్డికి ఓట్లేస్తారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ఎన్నో కొత్తకొత్త పథకాలు అమలు చేసి ఇక్కడి ప్రజల ఆశీర్వాదం పొందా. నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నా. మళ్లీ వారి ఆశీర్వాదం లభిస్తే.. నియోజకవర్గంలో మరింత అభివృద్ధికి పూనుకుంటా. కేంద్రం దగ్గర కొట్లాడైనా నిధులు తీసుకొస్తా.. అవసరమైన ప్రాజెక్టులు, హైవేలు సాధిస్తా. భారీ మెజార్టీతో గెలుస్తాననే నమ్మకం నాకున్నది.

భువనగిరి పార్లమెంట్ వైద్య, విద్యారంగాల్లో ఎలాంటి అభివృద్ధిని సాధించింది?
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా, వైద్య రంగాల్లో చెప్పుకోదగిన ప్రగతి సాధించింది. భువనగిరి నియోజకవర్గం విస్తరించి ఉన్న ఆరు జిల్లాల్లో మెడికల్ కళాశాలలు సాధించడం గొప్ప విషయం. వీటిలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎయిమ్స్ ఏర్పాటు కావడం జిల్లాకే కాదు యావత్ తెలంగాణకే గర్వకారణం. ఎంపీ అయిన మొదటి రోజు నుంచి ఎయిమ్స్ కోసమే పోరాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలిగా. విద్యారంగంలో భువనగిరిలో కేంద్రీయ విశ్వవిద్యాలయం. చేర్యాలలో పాలిటెక్నిక్, జనగామలో రూసా నిధులతో భవన నిర్మాణం చేపడుతున్నాం.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *