తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టులో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలో చేపడుతున్న పనులపై సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో నల్లా ద్వారా ఇంటింటికీ రక్షిత మంచినీళ్ళు అందించే వాటర్ గ్రిడ్ పనులను వేగంగా పూర్తిచేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. వాటర్ గ్రిడ్ పనులు ఎంతవరకు వచ్చాయి? ఇన్ టేక్ వెల్స్ ఎప్పటిలోగా పూర్తవుతాయి? అన్న అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు.
పనులు పూర్తయిన చోట మంచినీటి సరఫరా ప్రారంభించాలని, నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని పనులను త్వరగా పూర్తిచేయడంతోపాటు పూర్తయిన చోట్ల మంచినీటి సరఫరా చేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు కేసీఆర్ సూచించారు. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్, ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్ ఇన్ చీఫ్ బీ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.