రాష్ట్రంలో 10 రోజుల విడిది కోసం హైదరాబాద్ విచ్చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఘన స్వాగతం పలికారు. సోమవారం మధ్యాహ్నం 2:00 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ విమానంలో చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్, ముఖ్యమంత్రి పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. ప్రత్యేక తెలంగాణ బిల్లుకు ఆమోదముద్ర చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సీఎం కేసీఆర్ పాదాభివందనం చేయగా రాష్ట్రపతి కేసీఆర్ భుజం తట్టి అభినందించారు. అనంతరం అక్కడికి విచ్చేసిన అసెంబ్లీ స్పీకర్, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మలను రాష్ట్రపతికి పరిచయం చేశారు.
రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వచ్చిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో రాష్ట్రపతి కాసేపు గడిపిన అనంతరం రాష్ట్రపతి నిలయానికి బయలుదేరి వెళ్ళారు. హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ పదిరోజులపాటు బస చేస్తారు. జూలై ఒకటో తేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతి వెళ్తారు. తర్వాత మూడో తేదీన హైదరాబాద్ హెచ్ఐసీసీలో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు రచించిన ఉనికి గ్రంథంను రాష్ట్రపతి ఆవిష్కరించనున్నారు. ఇదిలాఉండగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్ధం గవర్నర్ నరసింహన్ మంగళవారం రాత్రి 7:30 గంటలకు రాజ్ భవన్ లో విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు రెండు రాష్ట్రాల స్పీకర్లు, డిప్యూటీ సీఎంలు, కొంతమంది మంత్రులను గవర్నర్ ఆహ్వానించారు.