తెలంగాణ భవన్ లో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడుతూ విజ్ఞులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచక్షణతో ఓటు వేయాలని, ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేస్తే అవి మోరీలో వేసినట్లేనని, ఆ పార్టీ అభ్యర్థులు గెలిచి వచ్చి శాసనమండలిలో చేసేదేమీ లేదని అన్నారు. చాలా కష్టపడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఊహించని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోతున్నాం. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే మండలిలోనూ టీఆర్ఎస్ బలం పెరిగి మరిన్ని బిల్లులు సులువుగా పాస్ చేసుకునే అవకాశం ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు.
నిన్నటివరకు వచ్చిన సర్వేల్లో రెండు పట్టభద్రుల స్థానాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారని తేలిందని సీఎం చెప్పారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, గత ఏడాది ఇదే సమయంలో రాష్ట్రంలో విపరీతమైన కరెంటు కోతలు ఉండేవని, కానీ ఈ సంవత్సరం ఇప్పటివరకు రాష్ట్రంలో కోతలు లేకుండానే కరెంట్ సరఫరా చేస్తున్నామన్నారు. ఇకపై కూడా 99.9% కోతలు లేకుండానే సర్వశక్తులు ఒడ్డి కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4300 మెగావాట్ల విద్యుత్ ఉందని, రానున్న నాలుగు సంవత్సరాల్లో 24వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుందని సీఎం పేర్కొన్నారు. ఇందుకోసం రూ. 79వేల కోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నామని, నల్గొండ జిల్లా దామరచర్లలోని యూనిట్ లో రెండు, మూడు రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని, శ్రీరామనవమికి భద్రాచలం వెళ్తున్నందున అదేరోజు మణుగూరు పవర్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేస్తామని సీఎం చెప్పారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున తెలంగాణకు అవరోధాలు కల్పిస్తున్నారని, మన హక్కులను బుల్డోజ్ చేస్తూ ఆయన వ్యవహారం ఉందని, కృష్ణా నదిపై తెలంగాణకు అన్యాయం చేస్తున్న వైనంపై వచ్చిన కథనాలను పట్టభద్రులు తప్పకుండా చదవాలని సీఎం కోరారు. చంద్రబాబు కరెంట్ ఇవ్వకుండా ఎగ్గొడుతుంటే దానిపై మనం ఫిర్యాదు చేసినా కేంద్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నదని, బాబు ఎన్డీయేలో భాగస్వామి కావడంతో కథలు చెప్తూ నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు జడ్జి, ప్రధానమంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రి ఇలా అందరినీ కలిసి విజ్ఞప్తి చేశాం. కానీ ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న బీజేపీ నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు? అధికారంలోకి వచ్చిన వెంటనే కర్కశంగా పోలవరం ముంపు పేరుతో ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపినందుకు ఓటేయాలా? ఇలాంటి వారికి పట్టభద్రుల ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని? సీఎం ప్రశ్నించారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న దేవీప్రసాద్ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని, టీఎన్జీవో అధ్యక్షుడిగా విశేష సేవలు అందించారని అన్నారు. అదేవిధంగా వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి మంచి సామాజిక కార్యకర్త, ఉద్యమకారుడని, సామాజిక స్పృహ ఉన్న పల్లాను మూడు జిల్లాల ప్రజలు గెలిపించాలని కోరారు. ఇద్దరు అభ్యర్థులను మొదటి ప్రాధాన్యతా ఓట్లతో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే ప్రభుత్వం ఇంకా మంచి పనులు చేసే ఆస్కారం ఉంటుందని కేసీఆర్ అన్నారు.