mt_logo

బీజేపీ ముసుగులో శిఖండి చంద్రబాబు!

అడుగడుగునా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అడ్డు తగులుతున్న చంద్రబాబును కలుపుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్న బీజేపీకి గుణపాఠం చెప్పాలని, బీజేపీ ముసుగులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలో శిఖండి రాజకీయాలు చేస్తున్నారని ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత కసిరెడ్డి నారాయణ రెడ్డి, బాలాజీ సింగ్ తో పాటు భారీ సంఖ్యలో వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా గులాబీ కండువాలు కప్పి మంత్రి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధికి అడ్డు తగులుతున్న టీడీపీతో జతకట్టిన బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదని, పోలవరం ముంపు ప్రాంతాల పేరుతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపింది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుకు ఓటేస్తే ఆంధ్ర పెత్తందార్లకు ఎర్ర తివాచీ పరిచినట్లేనని, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్న కిరణ్ సర్కారులో పదవులు వెలగబెట్టి నోరు మూసుకున్న వారు ఇప్పుడు కేవలం తొమ్మిది నెలల క్రితం ఏర్పాటైన తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రభుత్వానికి అండగా నిలవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *