mt_logo

అన్నన్నా.. చిన్నన్నా..!! ముంచింది ఎవరు?

By: సవాల్ రెడ్డి

-పోలవరం ముంపు మండలాలపై కాంగ్రెస్‌వన్నీ నంగనాచి కబుర్లే..
– కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అంతా జైరాం రమేశే!
– చట్టం రూపకల్పననుంచి ఆమోదందాకా..
– హైదరాబాద్‌కు పోలవరానికి లింకు పెట్టిన నేత
– కలపాలని అడిగింది వెంకయ్య..
-హామీ ఇచ్చింది మన్మోహన్..
– బాబుకు వివరాలిచ్చింది జైరాం
– రాజ్యసభలో సంపూర్ణ మద్దతు ప్రకటించింది కాంగ్రెస్
– సభ్యుల నోళ్లు మూయించింది గులాంనబీ ఆజాద్
ప్రాజెక్టు నిర్మాణాన్నే తొలినుంచి వ్యతిరేకించిన టీఆర్‌ఎస్ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం.. రాష్ట్రపతికి లేఖ ముంపు ఆర్డినెన్స్‌పై రెండుసార్లు బంద్.. కేంద్రానిది ఫాసిస్టు చర్యగా అభివర్ణన ప్రభుత్వంలో ఉండీ బంద్ పాటించిన టీఆర్‌ఎస్.. లోక్‌సభలో వినోద్, రాజ్యసభలో కేకే పోరు .

చరిత్ర కళ్లకే గంతలు కట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. పోలవరం ప్రాజెక్టుకింద ఏడు మండలాలు ఏపీకి తరలించిన ముదనష్టపు చర్యను తెలంగాణ ప్రభుత్వానికి అంటగట్టడానికి తెగిస్తున్నది. తమ పార్టీ కేంద్రంలో అధికారం వెలగబెట్టిన సమయంలోనే ముంపు మండలాల తరలింపు ఆర్డినెన్స్ పురుడు పోసుకున్న చారిత్రక సత్యాన్ని దాచి టీఆర్‌ఎస్ ప్రభుత్వం మీద బురద చల్లడానికి యత్నిస్తున్నది.

ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియగా వ్యవహరించిన జైరాం రమేశ్ ఘనకార్యాన్ని డొంక తిరుగుడు మాటలతో కప్పి పెట్టాలని ఆ పార్టీ నేత చిన్నారెడ్డి ప్రయత్నిస్తే ఇదేదో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యంగా చిత్రించడానికి పువ్వాడ ఎత్తులు వేస్తే.. అసలు ముంపు మండలాల తరలింపే జరగలేదని ఎన్నికల సమయంలో వ్యాఖ్యానించిన భట్టి విక్రమార్క ఇవాళ టీఆర్‌ఎస్ ప్రభుత్వం మీద నెపం పెడుతున్నారు. చిన్నారెడ్డి ఓ అడుగు ముందుకు వేసి టీఆర్‌ఎస్ ఆనవసరంగా జైరాం రమేశ్‌పై నిందలు వేస్తున్నదని, అప్పటి గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రికి మండలాల తరలింపుతో సంబంధం ఎలా ఉంటుంది.. అది హోంమంత్రి పరిధిలోని అంశం కదా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ ఈ తరలింపు పాపం ఎవరిది? ఎవరు పాత్రధారులు? ఎవరు సూత్రధారులు?..
పోలవరం ప్రాజెక్టు అమలు చేసేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్.. దాని స్థానంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన పునర్వ్యవస్థీకరణ చట్టం సవరణ బిల్లులోని ప్రతి అక్షరమూ కామా, ఫుల్‌స్టాప్‌తోసహా యూపీఏ సర్కార్ హయాంలో మేము రాసిందే. దాన్ని యథాతథంగా అమలు చేయడం ద్వారా ప్రజాస్వామ్య రాజకీయాలకు ఎన్డీయే ప్రభుత్వం పట్టంగట్టింది. నేను నా కాంగ్రెస్ సహచరుల ఉపదేశాలు వినదల్చుకోలేదు. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ ఎలా భావోద్వేగంతో ముడిపడి ఉన్న అంశమో, పోలవరం ప్రాజెక్టుకూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంతే భావోద్వేగంతో కూడుకున్న అంశం. ఈ బిల్లుకు మేం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. నేను పోలవరం ప్రాంతాన్ని పలుమార్లు సందర్శించాను.

ఈ ప్రాజెక్టు వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని ఘంటాపథంగా చెప్పగలను. వాస్తవానికి తొలి బిల్లులో ఖమ్మం జిల్లా నుంచి ముంపు ప్రాంతాలను బదిలీ చేసే ప్రతిపాదన లేదు. బిల్లు వివిధ దశల్లో మార్పులు, చేర్పులు జరిగాయి. చివరికి తెలంగాణ, ఏపీ అభ్యంతరాలు దృష్టిలో ఉంచుకుని మూడో ప్రత్యామ్నాయంపై నిర్ణయం తీసుకున్నాం. దీని ప్రకారం కొన్ని మండలాలను పూర్తిగా ఒక మండలంలో కేవలం ముంపు గ్రామాలనే బదిలీ చేయాలని, భద్రాచలం పట్టణాన్ని రామ మందిరాన్ని తెలంగాణలో ఉంచాలని మార్చి 1న జరిగిన క్యాబినెట్‌లో నిర్ణయించాం

– 2014 జూలై 14న రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేశ్ చేసిన ప్రసంగం ఇది..
అప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన ఏడు మండలాల తరలింపు బిల్లు రాజ్యసభకు చేరింది. కాంగ్రెస్ ఈ బిల్లుకు పూర్తి స్థాయి మద్దతు ప్రకటించింది. ఏడు మండలాలను ఏపీకి తరలించే సవరణ బిల్లుపై సాక్షాత్తూ జైరాం రమేశే చర్చను ప్రారంభించారు. ఆ సందర్భంగానే పై విషయాలు మాట్లాడారు. సభలో కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ ఏపీ సభ్యులు పరస్పర వాగ్వాదానికి దిగితే సభపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ గట్టిగా అరిచి వారి నోరు మూయించారు. ఫలితంగా రాజ్యసభ మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించింది.
ఇదీ కథాక్రమం…

2014 ఫిబ్రవరి 20: ఏపీ పునర్విభజన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ముంపు మండలాలన్నీ ఏపీలో కలిపితేనే పోలవరం అడ్డంకులు తొలగిపోతాయని బిల్లుపై చర్చ సందర్భంగా నాటి ప్రతిపక్ష నాయకుడు వెంకయ్యనాయుడు సభలో ఉన్న ప్రధాని మన్మోహన్‌సింగ్ దృష్టికి తెచ్చారు. ప్రధాని మన్మోహన్ సింగ్ సభలో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కింద సహాయ పునరావాస కార్యక్రమాలను సున్నితంగా చేపట్టడానికి అవసరమైతే భవిష్యత్తులో చట్టానికి సవరణలు తీసుకువచ్చి సాధ్యమైనంత త్వరగా దాన్ని అమలు చేస్తామని హామీ ఇస్తున్నా. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు అని విస్పష్టంగా ప్రకటించారు.

2014 మార్చి 1: సభలో ప్రధాని ఇచ్చిన హామీకి అనుగుణంగా మార్చి 1న కేంద్ర మంత్రివర్గం ఖమ్మం జిల్లాలోని ఐదు మండలాలు పూర్తిగా, బూర్గంపాడు భద్రచలం మండలాలను పాక్షికంగా సీమాంధ్రకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరుతూ రాష్ట్రపతికి పంపించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేసీఆర్ రాష్ట్రపతికి లేఖ రాస్తూ ఆ ఆర్డినెన్స్‌ను ఆమోదించవద్దని కోరారు. ఆర్డినెన్స్ పరిశీలనలో ఉండగానే మార్చి 5న ఎన్నికల షెడ్యూల్ విడుదలై నియమావళి అమలు కావడంతో ఆర్డినెన్స్ వెలుగు చూడలేదు.

2014 మే 26: కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్, మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు ఢిల్లీలోని ఏపీ భవన్‌కు వచ్చి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. రాష్ట్ర విభజనతో ముడిపడి ఉన్న అంశాలమీద ఆయనకు ఒక నోట్ అందచేశారు. విభజన చట్టానికి సంబంధించిన కొంత సమాచారాన్ని చంద్రబాబు అడిగారు.. అది ఆయనకు అందచేశాను అని మీడియాకు చెప్పారు.

2014 మే 28: ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఏపీకి బదిలీ చేస్తూ కేంద్రం నిర్ణయిం తీసుకుంది. ఈ మేరకు అదేరోజు రాష్ట్రపతి ఆర్డినెన్స్ విడుదల చేశారు. ఈవిషయంలో చంద్రబాబు కేంద్రమంత్రి అశోకగజపతి రాజు ద్వారా పావులు కదిపారు. జూన్ రెండున రెండు రాష్ర్టాలు ఏర్పడే లోపలే ఈ పని జరగాలని ఒత్తిడి తెచ్చారు. తెలుగుదేశం మహానాడుకు కూడా వెళ్లకుండా అశోకగజపతి రాజు, కంబంపాటి ఢిల్లీలో ఉండి ఆర్డినెన్స్‌కు ఒత్తిడి తెచ్చారు ఇందులో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కీలకపాత్ర వహించారని వార్తలు వచ్చాయి. ఈ నిర్ణయాన్ని ఫాసిస్టు చర్యగా సీఎం కేసీఆర్ అభివర్ణించారు. రాష్ట్రపతికి లేఖ రాసి ఆ ఆర్డినెన్స్‌ను ఆమోదించవద్దని కోరారు. అయితే ఫలితం లేకపోయింది.

2014 మే 29: ఆర్డినెన్స్‌కు నిరసనగా టీఆర్‌ఎస్ బంద్‌కు పిలుపునిచ్చింది. తెలుగుదేశం, బీజేపీ తప్ప మిగిలిన పక్షాలన్నీ మద్దతు ప్రకటించాయి.

2014 జూలై 11: ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఏపీలో కలిపే ఆర్డినెన్స్ స్థానంలో బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అంతకు ముందే సభలోకి బిల్లు తీసుకురాగా రాష్ట్రపతి అనుమతి లేకుండాబిల్లు తెచ్చారని టీఆర్‌ఎస్ వాదించడంతో వాయిదా వేసుకుని రాష్ట్రపతి అనుమతి పొందిన తర్వాత తిరిగి లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

రాష్ట్ర సరిహద్దులు మార్చే అంశం కాబట్టి ఆర్టికల్ 3 ప్రకారం ఉభయ రాష్ర్టాల అభిప్రాయాలు తీసుకోవాల్సిందేనని ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు అర్హత లేదని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్ తీవ్రంగా వాదించారు. టీఆర్‌ఎస్ ఎంపీలకు ఒడిశా ఎంపీలు కూడా స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ బిల్లు చట్టవిరుద్ధమైతే కోర్టుకు పోమ్మని సలహా ఇచ్చారు. సభ మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించింది. ఆనాడు కాంగ్రెస్ నేత డీ శ్రీనివాస్ ఇదంతా చంద్రబాబు ప్రోద్బలంతో జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లును బాగానే వ్యతిరేకించిందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

2014 జూలై 14: బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. బిల్లును వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ ఎంపీ కే కేశవరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ తిరస్కరించింది. తర్వాత తరలింపు బిల్లుపై చర్చను కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేశ్ స్వయంగా ప్రారంభించి బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ ఏపీ ఎంపీలు వాగ్వాదానికి దిగడంతో సభలో ఆ పక్షనేత గులాంనబీ ఆజాద్ వారిని గద్దించారు. బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇచ్చింది. మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది.

వెంకయ్యనాయుడు ఏమన్నారు..?
2014.5 9: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రకు బదిలీ చేస్తూ మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదననే కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. ఇందులో ఎలాంటి వివాదాలకు తావులేదు. మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో మాట్లాడినపుడు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి అడ్డంకులుంటే వాటిని తగురీతిలో తొలగించి ముందుకు తీసుకువెళతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే ఆర్డినెన్స్ తెస్తామని ప్రకటించింది.

మేం ప్రతిపక్షంలో ఉన్నపుడు ముంపు ప్రాంతాలను ఆంధ్రకు బదిలీ చేసే సవరణను బిల్లు లేదా ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలని డిమాండ్ చేశాం. దీనిపై పార్లమెంటులోని అన్ని పార్టీల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం దృష్ట్యా మేం ఇపుడు నిర్ణయం తీసుకున్నాం. గోదావరి జలాలు తెలంగాణ వినియోగించుకున్నాకే కిందికి వెళ్తాయి. ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలన్నది కేంద్రం విధానం. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టి వారివారి రాష్ర్టాల అభివృద్ధిలో ముందడుగు వేయాలి. ప్రాజెక్టు ఒక ప్రాంతంలో ముంపు మరో ప్రాంతంలో ఉంటే ముంపు ప్రాంతం ఉన్న రాష్ట్రం భూసేకరణ జరుపుకపోతే ప్రాజెక్టు ముందుకు వెళ్లదు. చట్టంలోని ఈ లొసుగులను సరిదిద్ది ఖమ్మం జిల్లాలోని వారికి పునరావాసం కల్పించేందుకు ఆర్డినెన్సు ఇచ్చాం. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పడి మిగులు ఆదాయం వస్తున్నపుడు స్థానిక విషయాలకు సెంటిమెంటు ఆపాదించడం మంచిది కాదు
-సవాల్‌రెడ్డి

టీఆర్‌ఎస్ చేసిన పోరాటం ఇదీ..

టీఆర్‌ఎస్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన దశనుంచే వ్యతిరేకిస్తూ వచ్చింది. నాటి వైఎస్ ప్రభుత్వం మందబలంతో దీన్ని చేపట్టినపుడు సుప్రీంకోర్టులో కేసు వేసింది కూడా టీఆర్‌ఎస్సే. టీఆర్‌ఎస్ కారణంగా పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు ఏర్పడ్డాయని వైఎస్ సీమాంధ్రలో జరిగిన అనేక ఎన్నికల సభల్లో కూడా చెప్పుకున్నారు. 2009లో ఇదొక అంశంగా ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్-టీడీపీల మహాకూటమి గెలిస్తే పోలవరం నిలిచిపోతుందని అక్కడి ప్రజలను హెచ్చరించారు. ఇక రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు కోసం భద్రాచలం డివిజన్ మొత్తంగా ఏపీలో చేర్చాలని అక్కడి నాయకులు చేసిన డిమాండ్‌ను టీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. చారిత్రిక అంశాలు లేవనెత్తి జీవోఎం ముందు వాదనలు వినిపించింది. ఫలితంగా భద్రాచలం రామాలయం సహా అనేక ప్రాంతాలు తెలంగాణలోనే ఉంచుతూ కేంద్రం రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచారు. జైరాం రమేశ్ విభజన చట్టం రూపకల్పన సమయంలో అనేకసార్లు కేసీఆర్‌ను కలిసి ఈ విషయమై చర్చలు జరిపినా ససేమిరా అనడంతో నాడు టీఆర్‌ఎస్ పొత్తుకోసం తహతహలాడుతున్న కాంగ్రెస్ తప్పని సరై భద్రాచలం ప్రాంతాన్ని తెలంగాణకే కేటాయించింది.

వాస్తవానికి ఈ సమస్య పరిష్కరానికి ఉత్తరాంధ్రతో కలిపి తెలంగాణ ఏర్పాటు చేయాలని నాటి డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క విచిత్ర ప్రతిపాదన ముందుకు తెచ్చారు. అయితే ఎవరూ పట్టించుకోలేదు. రాయల తెలంగాణ అంశంలో కూడా టీఆర్‌ఎస్ పట్టు కారణంగానే ఆ ప్రతిపాదన వీగిపోయింది తప్ప టీ కాంగ్రెస్ కృషి పూజ్యం. ఇక విభజన చట్టం చివరి అంకంలో వెంకయ్యరూపంలో సీమాంధ్రులు రాజ్యసభలో బిల్లుకు అడ్డు పడ్డారు. ఆ సమయంలో ప్రధాని హామీ ఇచ్చారు. ఆ వెంటనే మార్చి 1న కేంద్ర క్యాబినెట్ ఆ మేరకు తీర్మానించి ఆర్డినెన్స్ కోసం రాష్ట్రపతికి నోట్ పంపించింది.

అప్పటికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఢిల్లీలో ఉన్నసమయంలోనే ఆయన మంత్రి జైపాల్ రెడ్డిని కలిసి హెచ్చరించారు. అయితే అక్కడ స్పందన రాలేదు. మార్చి 4న రాష్ట్రపతికి కేసీఆర్ లేఖరాశారు. తెలంగాణలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయడం దారుణమని దీనిపై రాష్ట్రపతి స్పందించాలని కోరారు. కేంద్రం ఆర్డినెన్స్ చట్టవిరుద్ధమని, కేబినెట్ సంప్రదింపులు, మంత్రుల బృందం తీసుకున్న నిర్ణయం, పార్లమెంటు చర్చల అనంతరం రూపొందించిన చట్టానికి వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం దారుణమని లేఖలో పేర్కొన్నారు. శాసనసభ అభిప్రాయం కోరకుండా సరిహద్దులు మార్చడం ఆర్టికల్ 3ను ఉల్లంఘించడమే. ఈ ప్రాజెక్టు వల్ల గిరిజనులు నిర్వాసితులవుతున్నారు. సీలేరు ప్రాజెక్టును తెలంగాణ కోల్పోతుంది.

అని ఆయన పేర్కొన్నారు. కాగా మార్చి 5న ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆ ప్రతిపాదన మూలకు పడింది. ఎన్నికల అనంతరం మోదీ ప్రభుత్వం అధకారంలోకి రావడంతో చంద్రబాబు పావులు కదిపారు. జైరాం రమేశ్ ఆయనకు వంత పాడడంతో కేంద్రం తొలిక్యాబినెట్‌లోనే ఈ అంశాన్ని చేపడుతున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై మే 28న కేసీఆర్ ముంపు మండలాలపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని ప్రధానికి బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. క్యాబినెట్ తొలి సమావేశంలోనే ఇలాంటి అప్రజాస్వామిక నిర్ణయం తీసుకుంటే అది ప్రధాని మోదీ ముఖానికి మసిపూసుకున్నట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రపతికి 4 పేజీల లేఖ రాశారు. ఆ ఆర్డినెన్సును తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు.

గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన నాటినుంచే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలులోకి వచ్చిందని గుర్తు చేశారు. ఆర్టికల్ 3 ప్రకారం సరిహద్దుల మార్పు రాష్ట్రపతి సిఫార్సుల మేరకే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. వీటిపై క్యాబినెట్ ఆర్డినెన్సులు చెల్లవు. పార్లమెంటు తనంత తానుగా ఆర్టికల్ 3 కింద బిల్లును పరిశీలనలోకి తీసుకోవడం సాధ్యపడదు. ప్రస్తుత ఆర్డినెన్సువల్ల తెలంగాణలోని లోయర్‌సీలేరు ఏపీకి వెళ్తుంది. తెలంగాణలో విద్యుత్ ఇబ్బందులు వస్తాయి. టీడీపీ ఒత్తిడి మేరకే బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్సు రూపంలో తెలంగాణకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. మే 29న కేంద్రం నిర్ణయానికి నిరసనగా రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు.

రాష్ట్రం ఏర్పడిన అనంతరం జూన్ 14న పోలవరం ఆర్డినెన్సుకు చట్టం రూపం ఇవ్వవద్దని కోరుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లును పార్లమెంటుకు తీసుకురానున్న నేపథ్యంలో జూలై 6న పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పోలవరం ముంపు సమస్యపై పోరాటం జరపాలని, బిల్లును అడ్డుకోవాలని టీఆర్‌ఎస్ ఎంపీలను కేసీఆర్ ఆదేశించారు. లోక్‌సభలో రాజ్యసభలో టీఆర్‌ఎస్ సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ తీవ్రంగా పోరాడినా కాంగ్రెస్,బీజేపీలు రెండు మద్దతు పలకడంతో ప్రయోజనం లేకుండా పోయింది.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *