హైదరాబాద్ లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)కు మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారు. కలాంకు హైదరాబాద్ తో విడదీయరాని సంబంధం ఉందని, డీఆర్‌డీవోకు కలాం పేరు పెట్టడం భావితరాలకు స్ఫూర్తినిచ్చేవిధంగా ఉంటుందని, భారత రక్షణ వ్యవస్థ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించినట్లు అవుతుందని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన డీఆర్‌డీవోకు కలాం డైరెక్టర్ గా పనిచేసిన సమయంలోనే అనేక పరిశోధనలు జరిగాయని, డీఆర్‌డీఎల్, ఆర్సీఐ, మిథాని, ఐసీబీఎం తదితర రక్షణశాఖ అనుబంధ సంస్థలు హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం వెనుక కలాం కృషి ఉందని, అటువంటి గొప్ప వ్యక్తి పేరు డీఆర్‌డీవోకు పెట్టాలని ప్రధానికి రాసిన లేఖలో సీఎం కేసీఆర్ వివరించారు.