ఆదివారం హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల సమ్మేళన సభలో ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడేవరకూ ఆట, పాటలు, గజ్జెల మోతలు, డప్పు చప్పుళ్ళు ఆగకూడదని అన్నారు. ఎక్కడ తెలంగాణ సభలు జరిగినా బస్సులు, లారీలు, బండ్లు అని చూడకుండా ఒక వెల్లువగా తరలివచ్చేవారని, తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల వద్దకు చేర్చిన ఘనత ముమ్మాటికీ కళాకారులదేనని కేసీఆర్ కొనియాడారు. అందుకే వారికి ఉద్యోగాలివ్వడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు ఇస్తామని సీఎం ప్రకటించారు. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద 14 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ సంస్కృతి, వారసత్వం ఉట్టిపడేలా ఏర్పాటు చేయనున్న తెలంగాణ సాంస్కృతిక సారధి భవనానికి మిద్దె రాములు పేరును, పక్కనే ఉన్న మరో భవనానికి వరంగల్ శంకరన్న పేరును, ఆర్ట్ గ్యాలరీకి కాపు రాజయ్య పేరును పెడతామని ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రతి పాటకు తెలంగాణ రుణపడి ఉందని, ఇప్పటికే 550 మంది కళాకారులను ప్రభుత్వంలో భాగస్వామ్యులను చేశామని, ఇంకా ఎవరైనా మిగిలితే వారికి కూడా అవకాశం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. నిన్నటిదాకా ఉద్యమకారులైన కళాకారులు ఇకపై బంగారు తెలంగాణకు కరదీపికలు కావాలని, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి కావాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని, తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం రూపొందిస్తున్న పథకాలపై పాటలు కట్టి గజ్జె కట్టి ప్రచారం చేయాలని కోరారు.
ఉద్యమంలో పనిచేసిన రసమయి బాలకిషన్ కు ప్రస్తుతం క్యాబినెట్ ర్యాంకే వచ్చిందని, త్వరలో మంత్రివర్గంలో సభ్యుడవుతాడని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. అనంతరం రసమయి మాట్లాడుతూ, తెలంగాణ వచ్చాక కళాకారుల గొంతు ఆగింది.. పాటలు లేవు.. పనులు లేవు.. అడ్డా కూలీలుగా పనులకు పోతున్న స్థితిలో వారికి నేనున్నానంటూ సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఎన్ని జన్మలెత్తినా వారి రుణం తీరేది కాదని కళాకారుల తరపున రసమయి ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాదాభివందనం చేశారు. విప్లవం అంటే ఎక్కడో లేదని, అది కేసీఆర్ వద్దే ఉన్నదని, కళాకారులు ఇవాళ గంటల తరబడి పాటలు పాడుతున్నారంటే ఆ ఎనర్జీ అంతా కేసీఆర్ ఇచ్చిందేనని, మిషన్ కాకతీయ, హరితహారం వంటి కార్యక్రమాలను ప్రజలముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా రసమయి ప్రతిజ్ఞ చేశారు.