హరితహారం కార్యక్రమంలో కొంతమంది పంచాయితీ రాజ్ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నట్లు తనకు సమాచారం వచ్చిందని, కరీంనగర్ డీపీవో పనితీరు సంతృప్తికరంగా లేదని, పనితీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. అధికారులు అలర్ట్ గా లేకపోతే కఠిన చర్యలు తప్పవని, మంచి మాటతో ఒక్కసారి చెప్తాం.. పని చేసే వారిని సమర్ధిస్తాం.. లేకుంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోక తప్పదని సీఎం అన్నారు. గ్రామాల్లో హరితహారంతో పాటుగా మొక్కల పోషణ బాధ్యతను వీఆర్వోలు, పంచాయితీ కార్యదర్శులు తీసుకోవాలని, పంచాయితీ పైసా ఖర్చు పెట్టకుండా ప్రతి గ్రామానికి ప్రభుత్వమే 40 వేల మొక్కలను పంపిస్తుందని, అందులో కనీసం 35 వేల మొక్కలైనా బతికేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, ధర్మారం, వెలగటూరులలో ఆదివారం జరిగిన హరితహారం కార్యక్రమంలో సీఎం పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం నిర్వహించిన సభల్లో సీఎం మాట్లాడుతూ హరితహారం కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, దీన్ని సమిష్టి బాధ్యతగా అందరూ భావించాలని, సమైక్య రాష్ట్రంలో అటవీ సంపదను పెంచుకోలేక పోయినందున సొంత రాష్ట్రంలో ఆ నష్టాన్ని పూడ్చుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని అన్నారు. ఈనెల 14న ధర్మపురి వద్ద గోదావరిలో పుష్కర స్నానం చేస్తానని, లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని పుష్కరాల మొక్కులు చెల్లించుకుంటానని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండవని, తల తాకట్టు పెట్టయినా సరే విద్యుత్ కష్టాలు లేకుండా చూస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉంటుందని, శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పరిధిలోని కాలువల పునరుద్ధరణ కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని, ఉద్యమకాలంలోనే ఈ సమస్యను పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నియోజకవర్గంలో సొంత డబ్బు ఖర్చు పెట్టి ఇంటికి నాలుగు నుండి ఆరు పండ్ల మొక్కలను అందిస్తూ ఆదర్శంగా నిలిచారని సీఎం ఈ సందర్భంగా ప్రశంసించారు. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మంచి వ్యక్తని, తొలినుండి ఉద్యమంలో తనతో కలిసి పనిచేశారని, క్రమశిక్షణ, అంకితభావం ఉన్న ఎమ్మెల్యే అని, కొప్పుల ఈశ్వర్ ను త్వరలో మంత్రిని చేస్తానని కేసీఆర్ ప్రకటించారు.