mt_logo

అందాల కాశ్మీరంలా ఆదిలాబాద్- సీఎం కేసీఆర్

ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గూడెంలో ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం నాడు ప్రారంభించారు. అనంతరం కడెం మండలం దేవునిగూడెంలో ఒకేచోట లక్ష మొక్కలు పెంచే కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభల్లో సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లాలో 12 ఇంచుల వర్షపాతం నమోదు అవుతున్నదని, ఇక్కడ అనేక వాగులు, వంకలు ఉన్నాయని, అయినా గత పాలకుల వైఫల్యం వల్ల కరువు చోటుచేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ ను అందాల కాశ్మీరంలా, ప్రముఖ పర్యాటక కేంద్రంగా తయారుచేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, త్వరలో ఆదిలాబాద్ లో విమానాశ్రయం కూడా వస్తుందని సీఎం ప్రకటించారు.

మేం డూప్లికేట్ ప్రాజెక్టులు కట్టం.. గతంలో ప్రాజెక్టులు అంటే కేవలం కమీషన్ల కోసమే కట్టారు. మేం ప్రజల కోసం పనిచేస్తున్నాం.. ప్రజలకు పనికొచ్చేవే కడతాం.. సమైక్య పాలకులు పేరుకే ప్రాజెక్టులు ప్రారంభం చేసి నీళ్ళు ఆంధ్రా ప్రాంతానికి తరలించుకున్నారని, ప్రాజెక్టులు ఉంటే కాలువలు లేవని, కాలువలు కడితే ప్రాజెక్టులు లేవని మండిపడ్డారు. వారి ఉద్దేశం తెలంగాణకు నీళ్ళు రాకుండా అడ్డుకోవడమేనని, అంతర్రాష్ట్ర వివాదాలు సృష్టించే విధంగా ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు డిజైన్ చేశారని, ఈ ప్రాజెక్టు కింద మహారాష్ట్రలో భూములు మునుగుతాయన్నారు. ప్రాజెక్టును కట్టొద్దని, దానికోసం ఖర్చు పెట్టే డబ్బులు వృధా అవుతాయని మహారాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో చెప్పిందని గుర్తుచేశారు. అంతేకాకుండా తాను మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడి ప్రభుత్వం మీరు కావాల్సిన నీళ్ళు తీసుకెళ్ళండి కానీ మా భూములు మాత్రం మునగకుండా చూడండని విజ్ఞప్తి చేసిందని కేసీఆర్ చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ళ ద్వారా గత ప్రభుత్వం జిల్లాకు 56 వేల ఎకరాలకు నీరు అందించాలని ప్రతిపాదిస్తే, తమ ప్రభుత్వం మాత్రం లక్షా 50 వేల ఎకరాలకు నీరందించాలని ప్రతిపాదించామని సీఎం తెలిపారు.

తమ్మిడిహట్టి వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుచేసి నీటిని ఆదిలాబాద్ జిల్లాకు తరలిస్తామని, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఆయకట్టుకు నీళ్ళు అందుతాయని, కాళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి ఆ నీటిని మిగతా జిల్లాలకు తరలిస్తామని సీఎం చెప్పారు. జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు తెచ్చుకునే అవకాశం ఉందని, ఎవరూ అరుపులు, పెడబొబ్బలు పెట్టాల్సిన అవసరం లేదని, ఈ జిల్లాలో ఉన్న సమస్యలు తనకు తెలుసని కేసీఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఐదారేళ్లలో ప్రాజెక్టులు పూర్తిచేసి ఇంచు భూమి కూడా వదలకుండా సాగునీరు అందించే బాధ్యత తనదేనని సీఎం చెప్పారు.

అనంతరం దేవునిగూడెంలో ఒకేచోట లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ ఎలా పచ్చగా ఉండాలని నేను కోరుకుంటున్నానో అదేవిధంగా ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం లేదని, ఇందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని అన్నారు. 80 హెక్టార్ల భూమిలో ఎక్కడైతే అడవిని నరికారో, అక్కడే ఒకేసారి లక్ష మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినందుకు అటవీశాఖ మంత్రి జోగు రామన్న, అటవీ అధికారులు, జిల్లా కలెక్టర్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖామంత్రి జోగురామన్న, దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఆదిలాబాద్ ఎంపీ జీ నగేష్, ఎమ్మెల్యేలు దివాకర్ రావు, కోవ లక్ష్మి, దుర్గం చిన్నయ్య, విఠల్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *