తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ది చేయడమే ‘దళిత బంధు’ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. శనివారం ప్రగతి భవన్ లో జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దళిత బంధు పథకం ద్వారా నూరుశాతం సబ్సిడీ కింద అందించే పది లక్షల రూపాయలు, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే కాకుండా.. సామాజిక పెట్టుబడిగా మారి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతంగా పటిష్టం చేయడంలో దోహద పడుతుందని పేర్కొన్నారు. దళిత బంధును ఇప్పటికే ప్రకటించిన పద్దతిలో ప్రభుత్వం అమలు చేస్తుందని, అందుకు సంబంధించిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో దళిత బంధును ముందుగా ప్రకటించిన విధంగా అమలు చేస్తామన్నారు. దళితబంధుపై కలెక్టర్లకు దిశా నిర్దేశం చేసిన సీఎం కేసీఆర్.. ‘తాము ఎప్పుడు మోసగించబడుతామనే దుఃఖం దళిత వాడల్లో వుందని, వారి ఆర్తిని అర్థం చేసుకొని పని చేయాల్సిన అవసరం మన అందరిపై వుందని.. మీకు ఆకాశమే హద్దు. మీరు ఇప్పటి వరకు చేసిన ఏ పని లో లేని తృప్తి దళిత బంధు పథకం అమలులో చేయడంలో దొరుకుతుంది” అని వ్యాఖ్యానించారు. దళిత కుటుంబాల ఆర్థిక స్థితి ని మెరుగుపరిచేందుకు వున్న అన్ని అవకాశాలను వ్యాపార ఉపాధి మార్గాలను శోధించాలని, అందుకు దళిత మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, తదితర దళిత సామాజిక అభివృద్ది కాముకుల సలహాలు సూచనలు తీసుకోవాలని సీఎం కేసిఆర్ కలెక్టర్లకు సూచించారు.