పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలనుండి సుమారు మూడున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రూ. 35,200 కోట్లతో చేపట్టామని, ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడానికి గురువారం వెళ్తున్నానని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల భూములు సాగు చేయడానికి, ఇంకా హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు తీరుతాయని అన్నారు. అంతేకాకుండా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు అత్యధికంగా ఉన్నారని, సమైక్య రాష్ట్రంలో పాలకులు వారిని పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం వచ్చిన సార్ధకత ఉండాలంటే ఫ్లోరైడ్ బాధితుల కోసం రూ. 6, 190 కోట్లతో డిండి ప్రాజెక్టును చేపట్టాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామని కేసీఆర్ తెలిపారు.
గీతకార్మికులకు, మత్స్యకార్మికులకు రూ. 5 లక్షల ఇన్సూరన్స్ ఇవ్వాలని, మైనారిటీల కోసం 10 రెసిడెన్సియల్ స్కూళ్ళు, 10 హాస్టళ్లు ఏర్పాటు చేయాలని, ఓవర్సీస్ స్టడీస్ కోసం ఎస్సీ, ఎస్టీలకు ఏవిధంగా అయితే ఇస్తున్నామో అదేవిధంగా రూ. 25 కోట్లు మైనారిటీ బడ్జెట్ నుండి కేటాయించి వారికి కూడా ఇవ్వాలని నిర్ణయించామని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉండే అనాథ బాలికలు, బాలుర చదువుల భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని, పదోతరగతి తర్వాత ఎలా చదివించాలి అన్న విషయాన్ని నిర్ణయించడానికి కడియం శ్రీహరి అధ్యక్షతన సబ్ కమిటీని నియమిస్తామన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ళలో పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టాలని, రోజు విడిచి రోజు గుడ్డు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
నిజామాబాద్ జిల్లా రుద్రూరులో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కాలేజీ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వంలో ఉన్న 25 వేల ఖాళీలు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం చెప్పారు. జూలై నెలలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. తెలంగాణలో గతంలో ఉద్యోగాలు రాక వారి వయసు డినే చేయబడిందని, చాలా మందికి అన్యాయం జరిగింది కాబట్టి అది సవరించడం కోసం వయసు సడలింపు ఇవ్వాలని అంటున్నారు.. దీనిపై సీఎస్ ఆధ్వర్యంలో అధికారులతో వేసిన కమిటీకి చెప్పాం.. బహుశా వారం రోజుల్లో రిపోర్టు పెడతారు.. దానిపై ఫైనల్ నిర్ణయం తీసుకుని జూలైలో వందశాతం రిక్రూట్ మెంట్ చేపడతామని సీఎం హామీ ఇచ్చారు.