ఓటుకు నోటు కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబుపై రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్తున్న బాబు ఈ వ్యవహారంలో తన పాత్రను తానే ఒప్పుకున్నట్లని, చంద్రబాబు ఏపీకి సీఎం అయినా తెలంగాణకు సాధారణ పౌరుడేనని అన్నారు. బాబు ఢిల్లీలో ఎవరి కాళ్ళు పట్టుకున్నా చట్టం మాత్రం అందరికీ సమానమే అని కేటీఆర్ తేల్చిచెప్పారు. లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ కూడా చంద్రబాబు తీరును ఎండగట్టారన్నారు.
బాస్ చెబితేనే చేశానని రేవంత్ బాబు బాగోతాన్ని బట్టబయలు చేశారని, రేవంత్ రెడ్డిని టీడీపీ నుండి సస్పెండ్ చేయలేదంటేనే కూడబలుక్కుని ఈ వ్యవహారం నడిపారని అర్ధమవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేయలేదని, తప్పు చేసింది చంద్రబాబేనని, హైదరాబాద్ లో పోలీసులను మార్చిన బాబు పాలు, నీళ్ళు, విద్యుత్, కూరగాయలు కూడా ఏపీ నుండి తెచ్చుకుంటారా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అన్ని ఆధారాలతో బుక్కైన చంద్రబాబును వదిలే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.