mt_logo

జగిత్యాలలో మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ 

జగిత్యాలలో మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. ధరూర్‌ క్యాంపులోనే 27.08 ఎకరాల వైశాల్యంలో మెడికల్‌ కళాశాలను, దానికి అనుబంధంగా ప్రధాన దవాఖానను నిర్మించనుండగా.. సీఎం కేసీఆర్‌ భవన నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జగిత్యాలలో మెడికల్‌ కాలేజీని ప్రకటించారు. గతేడాది 1001 బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులకు అనుమతి అనుమతి ఇచ్చారు.

ధరూర్‌ క్యాంపులో 27 ఎకరాల్లో మెడికల్‌ కాలేజీకి స్థలం కేటాయించారు. కళాశాలకు అనుబంధంగా 330 బెడ్స్‌ దవాఖానకు మంజూరు చేసి తాత్కాలిక భవనంలో ప్రారంభించారు. ఈ యేడాది మే 7న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు దవాఖానను ప్రారంభించగా.. నవంబర్‌ 15న సీఎం కేసీఆర్‌ వర్చువల్‌ విధానంలో ప్రగతి భవన్‌ నుంచి మెడికల్‌ కాలేజీ తరగతులను ప్రారంభించిన విషయం తెలిసిందే. మెడికల్‌ కాలేజీకి సొంత భవన నిర్మించేందుకు 27.08 ఎకరాల వైశాల్యంలో కాలేజీకి భవనం నిర్మించడంతో పాటు దానికి అనుగుణంగా ప్రభుత్వ దవాఖానను నిర్మించనున్నారు. ఇందు కోసం రూ.119కోట్లు కేటాయించింది. రెండెకరాల్లో మెడికల్‌ కాలేజీ, అరెకరంలో విద్యార్థినుల క్యాంపస్‌, మరో అరెకరంలో బాలుర క్యాంపస్‌, దాదాపు నాలుగు ఎకరాల్లో అనుబంధ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణం చేపట్టనున్నారు.

అలాగే జగిత్యాల సమీకృత కలెక్టరేట్‌కు సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేశారు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన సీఎంకు అధికారులు ఘన స్వాగతం పలుకగా.. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కలక్టరేట్ ప్రారంభించిన అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాంబర్‌లోని సీట్లో కలెక్టర్‌ జీ రవిని కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *