mt_logo

కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు : సీఎం కేసీఆర్ 

జ‌గిత్యాల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్.. కొండ‌గ‌ట్టు ఆంజనేయస్వామి ఆల‌య అభివృద్ధికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్న‌ట్లు సీఎం ప్ర‌క‌టించారు. జ‌గిత్యాల జిల్లాలోని మోతెలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

“జ‌గిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేసుకోవడ‌మే కాదు.. ఇవాళ ఒక అద్భుత‌మైన క‌లెక్ట‌రేట్ నిర్మాణం చేసుకున్నాం. ఈ సంద‌ర్భంగా జ‌గిత్యాల జిల్లా ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌, ప్ర‌జ‌ల‌ను హృద‌య‌పూర్వ‌కంగా అభినంద‌లు, శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాను. ఈ జిల్లా వాసులు ఎవ్వరూ క‌ల‌ల‌లో కూడా అనుకోలేదు ఇది జిల్లా అయిత‌దని, బాగా అభివృద్ధి చెందుతుంద‌ని. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డ‌ది కాబ‌ట్టి జ‌గిత్యాల జిల్లా ఏర్పాటైంది.

ఉద్య‌మం జ‌రిగే సంద‌ర్భంలో అత్యంత మ‌హిమాన్విత‌మైన, అద్భుత‌మైన న‌ర‌సింహాస్వామి ధ‌ర్మ‌పురికి వ‌చ్చాను. ఆ రోజు ఒక మాట చెప్పాను. గోదావ‌రి న‌ది.. నాటి ఏపీలో తెలంగాణ‌లో మొద‌ట ప్ర‌వేశిస్తే గోదావ‌రి పుష్క‌రాలు ఎందుకు జ‌ర‌ప‌రు అని సింహాంలా గ‌ర్జించాను. దాని మీద చాలా ర‌కాలుగా మాట్లాడారు. ధ‌ర్మ‌పురి స్వామి చాలా మ‌హిమాన్విత‌మైన‌ స్వామి. శేష‌ప్ప క‌వి స్వామి మీద అద్భుత‌మైన ప‌ద్యాలు రాశారు. స్వామి వారిని ద‌ర్శించి నీ ద‌య వ‌ల్ల పుష్క‌రాలు జ‌రుపుదాం అని మొక్కుకున్నాను. మ‌ళ్లీ పుష్క‌రాలు వ‌చ్చే లోపు రాష్ట్రాన్ని సాధించి, ఇక్క‌డే పుష్క‌రాలు జ‌రుపుదామ‌ని మొక్కాను. నిండు మ‌న‌సుతో మొక్కాను. ధ‌ర్మ‌ప‌త్ని స‌మేతంగా వ‌చ్చి తెలంగాణ ఉద్య‌మం జ‌రిగే స‌మ‌యంలో ధ‌ర్మ‌పురిలో పుష్క‌ర స్నానం చేసి స్వామి వారిని ద‌ర్శించుకున్నాను. పండితులు తెలంగాణ ప్రాప్తిర‌స్తు అని దీవెన ఇచ్చారు. స్వామి వారి ద‌య, వేదపండితుల ఆశీస్సుల‌తో తెలంగాణ వ‌చ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా పుష్క‌రాలు జ‌రుపుకున్నాం. ల‌క్ష‌లాది మంది ధ‌ర్మ‌పురికి త‌ర‌లివ‌చ్చారు. మంత్రులు ట్రాఫిక్ పోలీసుల్లా వ్య‌వ‌హ‌రించి ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా పుష్క‌రాలు నిర్వ‌హించుకున్నాం. చాలా అద్భుతంగా ముంద‌కు పోతున్నాం.

తెలంగాణ ఆధ్యాత్మిక ప‌రిమ‌ళాలు ఉన్న ప్రాంతం. కాళేశ్వ‌రం, ధ‌ర్మ‌పురి, కొండ‌గ‌ట్టు అంజ‌న్న దేవాల‌యంతో పాటు ప‌లు పుణ్య‌క్షేత్రాలు ఉన్నాయి. కొండ‌గ‌ట్టు అంజ‌న్న స‌న్నిధికి హ‌నుమాన్ భ‌క్తులు ల‌క్ష‌ల సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తున్నారు. అంజ‌న్న దేవ‌స్థానం కేవ‌లం 20 ఎక‌రాల్లో మాత్ర‌మే ఉండేది. 384 ఎక‌రాల స్థలాన్ని దేవాల‌యానికి ఇచ్చాం. 400 ఎక‌రాల భూమి కొండ‌గ‌ట్టు క్షేత్రంలో ఉంది. కొండ‌గ‌ట్టు అంజ‌న్న క్షేత్రానికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నాం. త్వ‌ర‌లోనే నేను స్వ‌యంగా వ‌చ్చి ఆగ‌మ‌శాస్త్ర ప్ర‌కారం, భార‌త‌దేశంలో సుప్ర‌సిద్ధ‌మైన‌టువంటి పుణ్య‌క్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తాను అని హామీ ఇస్తున్నాను అని కేసీఆర్ ప్ర‌క‌టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *