సామాన్య ప్రజల కోసమే సీఎం కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారు : మంత్రి కేటీఆర్

  • January 24, 2022 3:52 pm

ప్రజల కనీస అవసరాలు తీర్చడానికే సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్ట్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు దేశానికి స్ఫూర్తి దాయకమన్నారు. తెలంగాణలో ఈ రోజు అమలు అవుతున్న పథకాలు.. దేశంలో వివిధ రాష్ట్రాల్లో మారుపేర్లతో అమలు చేస్తున్నారు. మంచినీటి సరఫరా, రైతుబంధు పథకాలు కేంద్రం అమలు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరా అవుతుందన్నారు. కొండపోచంపల్లి నుంచి గండిపేటకు మంచినీటి సరఫరాకు సీఎం కేసీఆర్ ఆలోచన చేశారని, తెలంగాణ ఏర్పాటు కాగానే 2 వేల కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ అంటే… జీహెచ్ఎంసీ ఒక్కటే కాదని, ORR లోపల ఉన్న 25 మున్సిపాలిటీలను హైదరాబాద్‌గా గుర్తించాలన్నారు. హైదరాబాద్ అన్ని నగరాల కంటే వేగంగా విస్తరిస్తోందని, ఢిల్లీ, చెన్నై, ముంబయి నగరాలు వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయన్నారు. హైదరాబాద్ మహానగరంలో 2051 సంవత్సరం నాటికి అవసరమైన వసతుల కోసం ఆలోచన చేస్తున్నామని, 6వేల కోట్లతో మంచినీటి ప్రాజెక్టులు చేపట్టామని చెప్పారు. చెన్నై లాంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాళేశ్వరం ఇరిగేషన్ కోసం మాత్రమే కాకుండా.. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్ల ద్వారా నీటిని హైదరాబాద్ తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.


Connect with us

Videos

MORE