తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ముందుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్‌తో కలిసి పోలీసు సిబ్బంది సీఎం కేసీఆర్ కు గౌరవ వందనం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ శిలాఫలకం వద్ద సీఎం పూజలు చేసి, ప్రారంభించిన సీఎం కేసీఆర్… కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… హైదరాబాద్ నడిబొడ్డున పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నెలకొల్పడం ప్రభుత్వ సంకల్ప బలానికి ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ రావాలని చెప్తూ వచ్చానని, అది ఈరోజు నెరవేరిందని, సంస్కారవంతమైన పోలీసు వ్యవస్థ నిర్మాణం జరగడం తన మరో కోరికను కూడా రాష్ట్ర పోలీసులు నెరవేర్చి, దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు. హైదరాబాద్‌లో ఇంత మంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ వస్తదని ఎవరూ ఊహించి ఉండరని, సంకల్పంతో దీన్ని నిర్మించామని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చాలా చేసిందని, గుడుంబా నిర్మూలన కోసం అనేక చర్యలు తీసుకున్నామని, పేకాట క్లబ్బులను మూసివేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో పోలీసులు మరింత చురుకుగా పని చేయాలని, మంచిని సాధించడానికి మంచి సంకల్పంతో పని చేస్తే సత్ఫలితాలు వస్తాయని తెలిపిన సీఎం కేసీఆర్… తెలంగాణ పోలీసు శాఖ అద్భుత ఫలితాలు సాధిస్తూ, ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాలని సూచించారు.
ఈ భూగోళంపై మానవాళి ఉన్నంత కాలం పోలీసింగ్ నిరంతరంగా ఉంటుందని పేర్కొన్న సీఎం… ఎంత బెటర్ పోలీస్ ఉంటే.. సమాజానికి అంత సేఫ్టీ, సెక్యూరిటీ ఉంటదని, ఇప్రూవ్‌మెంట్, రీఫామింగ్ ఎప్పుకటిప్పుడు అప్‌డేట్ అవసరం అన్నారు. ఆ పంథాలో ఏంచేయాలి.. ఎలా పురోగమించాలన్నప్పుడు చాలా మంది పెద్దలు చాలా చెప్పారన్నారు. మహేందర్‌రెడ్డి ఇలాంటి ఫెసిలిటీ క్రియేట్ చేసినట్లయితే, దాని నిర్వహణ ఆధ్వర్యం పోలీస్‌శాఖలో ఉన్నప్పటికీ.. యావత్ తెలంగాణ అడ్మినిస్ట్రేషన్‌కు మూలస్తంభంగా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని సీఎం కేసీఆర్ తెలియ జేశారు. నార్మల్ డేస్‌లో ఒక మాదిరిగా, విపత్తులు సంభవించినప్పుడు ఎమర్జెన్సీ షెల్టర్‌లాగా చాలా బాగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. కరోనా, తదితర విపత్తులు, కొన్ని రకాల ఆటంకాల వల్ల కొద్దిపాటి ఆలస్యంగా జరిగినప్పటికీ.. ఫైనల్‌గా అద్భుతంగా ఇవాళ భవనం నిర్మాణం కావడం సంతోషంగా ఉందన్నారు. ఒక గొప్ప వేదికను నిర్మించుకొని, ఉపయోగంలోకి తెచ్చుకున్న పోలీస్‌శాఖకు అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్… భవనాన్ని నిర్మించిన రోడ్లు భవనాలశాఖ మంత్రికి, ఆర్అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ గణపతిరెడ్డి, షాపూర్‌జీ నిర్మాణ సంస్థ, టెక్నాలజీని సమకూర్చిన కంపెనీ.. భవన నిర్మాణానికి ప్రతిచేసిన ప్రతి కార్మికుడికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, సీపీ సీవీ ఆనంద్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రం ప్రభుత్వం పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని అత్యాధునిక పరిజ్ఞానంతో, ఏడెకరాల స్థలంలో రూ.600కోట్ల వ్యయంతో నిర్మించింది. ఈ సెంటర్లో ఒకేసారి లక్ష సీసీటీవీ కెమెరాలు వీక్షించేలా బాహుబలి తెరలను కేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే కేంద్రంలో అన్నిశాఖల సమన్వయానికి సైతం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీటీవీ కెమెరా దృశ్యాలైనా సరే హైదరాబాద్‌లో ఉన్న ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వీక్షించవచ్చు. అన్ని జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాలు ఆయా జిల్లా కేంద్రాల్లోని మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానించారు. అక్కడి నుంచి ఫీడ్‌ను నేరుగా సీసీసీ జోడించారు. హైదరాబాద్ ఔటర్‌రింగ్ రోడ్డులోని సీసీటీవీ కెమెరాలు, మెట్రోస్టేషన్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాల ఫీడ్‌ను సైతం సీసీసీతో అనుసంధానించినట్లు అధికారులు తెలిపారు. 20 అంతస్తులున్న టవర్ ఏలోని 18వ అంతస్తులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.