mt_logo

రెండు మూడేళ్ళలోనే ప్రాజెక్టులు పూర్తిచేయాలి- సీఎం కేసీఆర్

నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేసేలా కాంట్రాక్టర్లను ప్రోత్సహించాలని, ఇందుకోసం కాంట్రాక్టర్లను మూడు షిఫ్టుల్లో పనిచేయించి, సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేయకుంటే డిస్ ఇన్సెంటివ్ ఇచ్చే విధానం కూడా ఉండాలని అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యాన్ని నివారించడానికి తీసుకోవలసిన చర్యలపై ఈ సమీక్షలో చర్చించారు.

ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అనేక ఆకాంక్షలు ఉన్నాయని, వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని, అదే విధంగా రైతులకు సాగునీరు అందించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తిచేయడంతో పాటు కృష్ణానదిపై పాలమూరు, డిండి.. గోదావరి నదిపై కాళేశ్వరం, ప్రాణహిత, దుమ్ముగూడెం లాంటి ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు. గతంలో ప్రాజెక్టుల నిర్మాణం దశాబ్దాల పాటు సాగేదని, తెలంగాణ రాష్ట్రంలో కేవలం రెండు, మూడేళ్ళలోనే ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించడాన్ని అత్యధిక ప్రాధాన్యం కలిగిన అంశంగా గుర్తించాలని, ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. భూసేకరణ విషయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు వచ్చాయని, భూసేకరణ వేగంగా జరుగుతున్నదన్నారు. ప్రతీ ఏటా రూ. 25 వేల కోట్ల నిధులను నీటిపారుదల శాఖకు కేటాయిస్తున్నందున పనులు జరుగుతున్న దానిని బట్టి నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయకు ఈ మొత్తం నుండి చెల్లింపులు జరగాలని సీఎం చెప్పారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు ఒక శాతం ఇన్సెంటివ్ ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్సి ఎస్ కే జోషి, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *