ఈ నెల 7వ తేదీనుండి జరిగే అసెంబ్లీ సమావేశాలపై అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు గురువారం ప్రగతి భవన్ లో మంత్రులు, విప్ లతో సమావేశం నిర్వహించారు. చర్చకు సిద్దమైన అంశాలను బీఏసీ సమావేశంలో ప్రతిపాదించాలని సూచించారు. ఇటీవల మరణించిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి అసెంబ్లీలో మొదటిరోజు ఘనంగా నివాళి అర్పించనున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో చర్చకు వచ్చే అంశాలపై మంత్రులు సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఎన్ని రోజులైనా సరే అన్ని రాజకీయ పక్షాలు ప్రతిపాదించిన అన్ని అంశాలపై నిజాలను చర్చించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని కేసీఆర్ చెప్పారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, దేశానికే ఆదర్శంగా ఉండేలా తెలంగాణ శాసనసభ నిర్వహించాలి.. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, చట్టాల అమలు క్షేత్రస్థాయిలో ఎట్లా ఉన్నదో పరిశీలించాలి. ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా సభ్యులు ప్రస్తావించాలి. ప్రభుత్వం సభ్యులడిగే ప్రతి అంశానికి సంబంధించిన వివరాలు చెప్తుంది. అధికారపక్ష సభ్యులు కూడా ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలనూ సభలో ప్రస్తావించాలి. అసెంబ్లీ అంటే తిట్లు, శాపనార్ధాలు, అల్లర్లు, దూషణలు, గందరగోళం కాదని, అసహనం ప్రదర్శించడానికి అసెంబ్లీ వేదిక కారాదని, ఈ ధోరణిలో మార్పు రావాలని, వాస్తవాలు ప్రతిబింబించాలని సీఎం పేర్కొన్నారు.
చట్టాలు తయారు చేయడానికి, బడ్జెట్ ఆమోదించడానికి, వీటి అమలు ఎలా ఉన్నదో విశ్లేషించుకోవడానికి అసెంబ్లీలో చర్చ జరగాలి. తెలంగాణ అసెంబ్లీ నిర్వహణలో గుణాత్మక మార్పులు రావాలని సీఎం అన్నారు. ఇదిలాఉండగా ఈనెల 7న సాయంత్రం 5 గంటలకు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. దివంగత నేత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతికి సంతాపం తెలుపుతారు. అనంతరం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించారు.