mt_logo

కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్న నేతలు..

కరోనా బాధితులను ఆదుకునేందుకు కొంతమంది ప్రజాప్రతినిధులు తమ సొంత ఖర్చులతో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డిలు తమ సొంత ఖర్చుతో కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇప్పటికే పైళ్ల శేఖర్ రెడ్డి బీబీనగర్ ఎయిమ్స్ లో 50 బెడ్లతో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేటలో ఐసోలేషన్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వీరు చేస్తున్న సేవలకు గానూ ప్రజలు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా నెక్కొండ మండలంలో కూడా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండడం, ఎక్కువగా గిరిజనులు, దళితులు ఉన్న ప్రాంతం కావడంతో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. కరోనా బారినపడి ఇంట్లో కనీస సౌకర్యాలు లేనివారి కోసం నెక్కొండలోని తెలంగాణ గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీలలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గురువారం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి వెళ్ళి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో కేసులు ఎక్కువగా నమోదైన నేపథ్యంలో రెండవ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు రైతుభీమా చెక్కులను అందించారు. రైతు కుటుంబాలకు మేలు చేసేలా సీఎం కేసీఆర్ పథకాలు రూపొందించారని, దేశంలో ఏ రాష్ట్రం అమలుచేయని విధంగా రైతుబంధు పథకంతో రైతులకు ఎకరానికి రూ. పదివేలు అందిస్తున్నారని అన్నారు. లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడమే ధ్యేయంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని సీఎం కేసీఆర్ ను ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *