mt_logo

ప్రతి ఎమ్మెల్యే మండలానికో గ్రామాన్ని దత్తత తీసుకోవాలి..

రాజేంద్రనగర్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో మంగళవారం గ్రామజ్యోతి పథకంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది. రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఆ లక్ష్యంతోనే గ్రామజ్యోతి కార్యక్రమాన్ని భారీ ఎత్తున తలపెట్టామని అన్నారు. గ్రామాల అభివృద్ధి పథకాలకు గ్రామస్తుల సమక్షంలో, వారి భాగస్వామ్యంతో రూపకల్పన జరపాలని చెప్పారు.

ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో గ్రామాల్లో రావాల్సినంత మార్పు రాలేదని, గ్రామీణ ప్రాంతాల్లో మంచి పద్ధతిలో అభివృద్ధి జరగలేదని సీఎం ఆన్నారు. గ్రామాలు, పట్టణాల్లో మార్పు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మానవవనరులకు మించిన సంపద లేదన్నారు. రాబోయే నాలుగేళ్ళలో వివిధ శాఖల ద్వారా గ్రామాల అభివృద్ధికి రూ. 25 వేల కోట్ల ఖర్చు పెడతాం.. స్థానికంగా ఏది అవసరమో గుర్తించి ఆ పనులు చేయాలి. ఇది కేవలం సర్పంచుల కార్యక్రమం కాదు. అందరిదీ. గ్రామ సభల్లో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ అందరూ పాల్గొని ప్రణాళికలు తయారు చేయాలని సీఎం సూచించారు. ప్రతి ఎమ్మెల్యే మండలానికో గ్రామాన్ని దత్తత తీసుకునేలా ప్లాన్ చేయాలని, ఆ గ్రామాలను మిగతా గ్రామాలకు ఆదర్శంగా చూపాలని ఆదేశించారు.

గ్రామాల్లో వెలుగులు నింపడమే గ్రామజ్యోతి లక్ష్యమని, ఈ కార్యక్రమాల్లో యువశక్తిని, మహిళాశక్తిని వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేపడితే వెంటనే నిధులు ఎన్ని వస్తాయి? అనే ప్రశ్న వస్తుందని, ఈ కార్యక్రమానికి డబ్బులు ప్రధానం కాదని, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను తీర్చిదిద్దడమే లక్ష్యం అని వివరించారు. గంగదేవిపల్లి గ్రామాన్ని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ కూనం రాజమౌళిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సన్మానించారు. ఇదిలాఉండగా గ్రామజ్యోతి పథకంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *