శుక్రవారం మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నగరంలో ఐదు రోజులపాటు జరిగిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ తో పాటు మంత్రులు, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, సీనియర్ ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ విప్ లతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నగరంలో ఎక్కడికి వెళ్ళినా ఇండ్లు లేని పేదలు తమకు ఇళ్ళు కావాలని అడుగుతున్నారని, హౌస్ ఫర్ ద పూర్ స్కీం పెట్టి ఇళ్లులేని పేదలకు ఇళ్ళు నిర్మించి నగరంలో స్లమ్ కల్చర్ లేకుండా చేస్తామని చెప్పారు. దశలవారీగా నగరంలో 2 లక్షల ఇళ్లు నిర్మిస్తామని, పేదలకు కట్టించే ఇళ్ళు ప్రభుత్వ స్థలాల్లోనే నిర్మిస్తామని, అవసరమైతే భూమి కొనుగోలు చేసి మరీ ఇళ్ళు కడతామని స్పష్టం చేశారు.
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతులు, అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలపై ఈనెల 26న ప్రజాప్రతినిధుల సమావేశం ఏర్పాటుచేసి నిర్ణయాలు తీసుకుంటామని సీఎం చెప్పారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చాలా గొప్ప స్ఫూర్తినిచ్చిందని, పట్టుదలతో పనిచేస్తే తప్పక ఫలితం ఉంటుందని నిరూపించిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తమ బతుకులు బాగుపడతాయనే నమ్మకం కలిగిందని, ప్రభుత్వం ప్రజల కోసం ఉందనే అభిప్రాయం వారిలో ఏర్పడిందని సీఎం పేర్కొన్నారు. నగరంలో ఒక్క చెత్త కాగితం ముక్క కూడా లేకుండా చూడాలని, ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేయాలని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు సీఎం పిలుపునిచ్చారు.
నగరంలో మొత్తం 77 నాలాలు ఉన్నాయని, ఇందులో ఐదు నాలాలు హుస్సేన్ సాగర్ లో కలుస్తాయని, మిగతా 72 నాలాలు మూసీలో కలుస్తాయని, మొత్తం 77 నాలాలు 390 కిలోమీటర్ల పరిధిలో ఉంటాయని చెప్పారు. ఈ నాలాలన్నీ నూటికి నూరుశాతం కబ్జాకు గురయ్యాయని, గతంలో పనిచేసిన కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులు పర్మిషన్లు ఇచ్చారని, నాలాల్లో నీళ్ళు ఇంటి గోడలకు తగులుకుంటూ పోతున్నాయని కేసీఆర్ చెప్పారు. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో కూడా అన్ని ఆక్రమణలే ఉన్నాయని, హైటెక్ సిటీలో చాలా బిల్డింగ్స్ కు అనుమతులు లేవని, నగరం మొత్తం ఇదే పరిస్థితి ఉందని, వీటన్నిటినీ క్రమబద్ధీకరించాలని సీఎం అన్నారు.