తెలంగాణ ఐటీ మరియు పంచాయితీ రాజ్ శాఖామాత్యులు కల్వకుంట్ల తారకరామారావు గారి అమెరికా పర్యటన విజయవంతంగా జరిగినందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అమెరికా విభాగం NRI TRS- USA హర్షం వ్యక్తం చేసింది.
ఈ సందర్బంగా కే.టీ.ఆర్ గారి పర్యటనను విజయవంతం చేసిన అన్ని తెలంగాణ సంఘాలను, వ్యక్తులను అభినందించింది. మంత్రిగారి ఈ పర్యటన విజయవంతం కావటానికి కీలకపాత్ర పోషించిన విజన్ తెలంగాణ అసోసియేషన్, తెలంగాణ ఎన్నారై అసోసియేషన్, న్యూజెర్సీ తెలంగాణ అసోసియేషన్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్, డల్లాస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్, బే ఏరియా తెలంగానైట్స్, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్, WATA, WATG శాక్రమెంటో తెలంగాణ అసోసియేషన్, అమెరికన్ తెలుగు అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంస్థలను NRI TRS- USA అభినందించింది.
పక్కా ప్రణాళికతో కే.టీ.ఆర్ గారి అమెరికా పర్యటన కార్యరూపం దాల్చడానికి కృషి చేసిన తెలంగాణ ఐటీ డైరెక్టర్ దిలీప్ కొణతం గారిని ప్రత్యేకంగా అభినందించింది.
కే.టీ.ఆర్ గారు మంచు తుఫాను, ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా సాహసోపేత ప్రయాణాలు చేస్తూ అహోరాత్రులు కష్టపడి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని తన వృత్తి నైపుణ్యంతో, వాక్ చాతుర్యంతో ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలకు పరిచయం చేసిన తీరు అందరిని ఆకట్టుకుంది. కే.టీ.ఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఐటీ పరిశ్రమకు బంగారు భవిష్యత్తు ఉంటుందని పలువురు ఎన్నారై పారిశ్రామిక వేత్తలు విశ్వాసం వ్యక్తం చేశారు.
మంత్రి గారి అమెరికా పర్యటన విజయవంతం కావడానికి సహకరించిన ప్రవాస తెలంగాణ పారిశ్రామిక వేత్తలు దయాకర్ పుస్కూర్ మరియు దండె విట్టల్ గారికి తెలంగాణ రాష్ట్ర సమితి అమెరికా విభాగం NRI TRS- USA కృతజ్ఞతలు తెలియజేసింది.