ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఎప్పటికీ చిరస్మరణీయుడే అని, ప్రజల్లో చైతన్య దీప్తి వెలిగించడానికి ఆయన ధైర్యంగా నిలబడేవారు అని సీఎం కేసీఆర్ అన్నారు. కాళోజీ 106 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ నివాళులు అర్పించారు. రవీంద్రభారతిలో ప్రజా కవి కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.
తెలంగాణ భూమి పుత్రుడు, ప్రజాకవి కాళోజీ జన్మదినం సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించారని, మన తెలంగాణ భాషను, యాసలోని మాధుర్యాన్ని తన రచనలతో ఎలుగెత్తి చాటారని కొనియాడారు. భాష రెండు విధాలుగా ఉంటుందని, ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష అని, పలుకుబడుల భాష కావాలని చెప్పిన తెలంగాణ వైతాళికుడు కాళోజీ అని కేటీఆర్ అన్నారు.