తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం అయిన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కరోనా నేపథ్యంలో కేవలం ఆరు ప్రశ్నలకు మాత్రమే అవకాశం కల్పించనున్నారు. అనంతరం జీరో అవర్ ఉంటుంది. టీ బ్రేక్ అనంతరం అత్యంత ప్రతిష్టాత్మకమైన రెవెన్యూ చట్టాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత కరోనాపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బీఏసీ నిర్ణయం ప్రకారం గంటపాటు ప్రశ్నోత్తరాలు, అరగంట పాటు జీరో అవర్ ఉంటుందని, గంటలోపే ప్రశ్నోత్తరాలు ముగించాలని అన్నారు. కరోనాపై కూడా చర్చ ఉంటుంది కాబట్టి సభ్యులందరూ సహకరించాలని పోచారం సూచించారు.
ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు బీసీ సంక్షేమ శాఖామంత్రి గంగుల కమలాకర్ సమాధానం ఇచ్చారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఏ రాష్ట్రాలూ అమలుచేయడం లేదని, మానవతా కోణంలో ఆలోచించి సీఎం కేసీఆర్ ఈ పథకాలకు రూపకల్పన చేశారని, ప్రేమ వివాహం చేసుకున్నా కూడా తల్లి పేరుమీదనే కళ్యాణలక్ష్మి చెక్కు వస్తుందని చెప్పారు. కరోనా సమయంలో కూడా ఈ పథకానికి ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు. 2014-15 నుండి 2020-21 వరకు బీసీలు, ఈబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ఈ పథకం ద్వారా 7,14,575 మంది కుటుంబాలకు ప్రయోజనం కలిగిందని మంత్రి వివరించారు. ఈ పథకాల కోసం ప్రభుత్వం రూ. 5,556.44 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.