mt_logo

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆదివాసీ, గిరిజనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కల్మశంలేని మానవీయ సంబంధాలకు ఆదివాసీ గిరిజనులు ప్రతీకలని, ఆదివాసీ బిడ్డలు సముజ్వలంగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. ‘మావ నాటే మావ రాజ్‌.. మా తాండాలో మా రాజ్యం’ అనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందని గుర్తు చేశారు. గిరిజనులకు సబ్‌ ప్లాన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. గురుకులాల ద్వారా అత్యున్నత స్థాయి విద్యను, అంబేదర్‌ విదేశీ విద్యానిధి ద్వారా విదేశీ విద్యను, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడడానికి ఆదివాసీ, గిరిజన యువతకు ఉచిత శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గిరిజనగూడెలకు, తండాలకు విద్యుత్తు, రోడ్లు వంటి మౌలిక వసతులను మరింతగా మెరుగుపరుస్తున్నామని తెలిపారు. కుమ్రంభీం స్మారక మ్యూజియంతోపాటు పలు మ్యూజియాలు ఇప్పటికే ప్రారంభం కాగా, రాంజీగోండు స్మారక మ్యూజియాన్ని త్వరలో నిర్మించనున్నట్టు సీఎం తెలిపారు. హైదరాబాద్‌లోని విలువైన ప్రాంతంలో ఆదివాసీ, గిరిజన ఆత్మగౌరవ భవనాలను నిర్మించామని గుర్తుచేశారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *