mt_logo

సీఎం కేసీఆర్‌కు సర్ చోటూరామ్‌ అవార్డు

రైతులకు మేలు చేసేలా వ్యవసాయ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు అఖిల భారత రైతు సంఘం ప్రతిష్ఠాత్మకమైన సర్‌ చోటూరామ్‌ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును సీఎం కేసీఆర్‌ తరఫున వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్వీకరించారు. గురువారం హైదరాబాద్‌కు వచ్చిన ఇండియన్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌, సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా సభ్యుడు సత్నాంసింగ్‌ బెహ్రూ, ఇండియన్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అఖిల భారత సలహాదారులు సుఖ్‌జిందర్‌సింగ్‌ కాకా, రచ్‌పాల్‌సింగ్‌ ఖల్సా, మీడియా కార్యదర్శి అవతార్‌సింగ్‌ దుండా మంత్రికి అవార్డును అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. భారత రైతాంగ శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్‌ మహాయజ్ఞాన్ని ప్రారంభించారని చెప్పారు. దేశంలో అందుబాటులో ఉన్న వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకొని రైతులకు మేలు చేస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని తెలిపారు.

తెలంగాణ మాడల్‌ను దేశానికి పరిచయం చేసి కొత్త దారి చూపాలన్న తపనతో సీఎం ఉన్నారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ మాడల్‌కు మేధావులు, రైతు నాయకులు విశేషంగా ఆకర్షితులవుతున్నారని అన్నారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి 700 మందికి పైగా రైతులు చనిపోతే కేంద్ర ప్రభుత్వంలో కనీస చలనం కూడా లేదని మండిపడ్డారు. చనిపోయిన రైతు కుటుంబాలకు కనీసం పరిహారం ఇవ్వాలన్న ఆలోచన కూడా కేంద్రానికి లేదని విమర్శించారు. ఎకడో పంజాబ్‌కు దూరంగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాల ఎల్లలు దాటి చనిపోయిన రైతు కుటుంబాలకు ఒకొకరికి రూ.3 లక్షల చొప్పున సాయం అందించి చేయూతనిచ్చారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, మూసీ రివర్‌ బోర్డ్‌ మేనేజ్‌మెంట్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎవరీ సర్‌ చోటూరామ్‌ :
పంజాబ్‌ రైతులు ఆరాధించే ఇద్దరు ప్రధాన వ్యక్తుల్లో ఒకరు స్వామినాథన్‌ కాగా మరొకరు సర్‌ చోటూరామ్‌. వడ్డీ వ్యాపారుల చేతుల్లో పడి నలిగిపోతున్న నాటి పంజాబ్‌ రైతుల శ్రేయస్సు కోసం సర్‌ చోటూరామ్‌ 1934లో పంజాబ్‌ రైతు రుణ విముక్తి చట్టం, 1936లో పంజాబ్‌ రుణదాతల రక్షణచట్టం తేవడానికి కృషిచేశారు. ఈ రెండు చట్టాలతో పంజాబ్‌ రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆ తర్వాత స్వామినాథన్‌ తెచ్చిన హరిత విప్లవంతో మరింత మార్పు వచ్చింది. దీంతో ఆ ఇద్దరిని పంజాబ్‌ రైతులు ఎంతగానో ఆరాధిస్తారు. ఈ ఇద్దరి తర్వాత తమను అధికంగా ప్రభావితం చేసిన నాయకుడు కేసీఆర్‌ మాత్రమేనని పంజాబ్‌ రైతు సంఘం నేతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *