mt_logo

ఢిల్లీ వేదికగా వరి పోరు జరుపనున్న సీఎం కేసీఆర్

తెలంగాణలో పండిన వరి ధాన్యం మొత్తాన్నీ కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్ తో అధికార టీఆర్ఎస్ భారీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే వారం రోజులపాటు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వరి పోరును ఉధృతం చేయనున్నారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఈనెల 11న ఢిల్లీలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వరి పోరు విషయంలో ఎంత వరకైనా వెళతానని, మోదీ సర్కార్ మెడలు వంచేదాకా నిద్రపోనని ఇదివరకే స్పష్టం చేసిన సీఎం కేసీఆర్ ఉద్యమ కార్యచరణ నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత ఉన్నారు. వరి పోరులో భాగంగా టీఆర్ఎస్ ఇప్పటికే ఉద్యమ కార్యాచరణలో భాగంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ కేంద్రంగా ఎంపీలకు, ప్రజాప్రతినిధులు, శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 11న ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులతో భారీ నిరసన చేపట్టనున్నారు. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కు టీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. సోమవారం మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, బుధవారం(6న) జాతీయ రహదారులపై రాస్తారోకో, గురువారం (7న) హైదరాబాద్‌ మినహా మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, శుక్రవారం (8న) గ్రామాల్లో కేంద్రం దిష్టిబొమ్మల దహనం, ఇళ్లపై నల్లా జెండాల ఎగురవేత, ఆపై వచ్చే సోమవారం(ఏప్రిల్ 11న) సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీలో నిరసన దీక్షకు టీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఢిల్లీలో జరగబోయే దీక్షలో సీఎం కేసీఆర్‌ తోపాటు టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్‌ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మున్సిపల్‌ చైర్మన్లు మేయర్లు, టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొంటారు. కాగా, వరి పోరును ఉధృతం చేయడానికి ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ వీలైతే ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలవనున్నారు. ఇప్పటికే ప్రధాని అపాయింట్‌మెంట్‌ సీఎంవో వర్గాలు కోరాయి. వారం రోజులకుపైగా ఢిల్లీలో గడపనున్న సీఎం కేసీఆర్ ఓ వైపు వరి పోరు సాగిస్తూనే, ధాన్యం అంశంలో బీజేపీ వ్యతిరేక శక్తులను కేసీఆర్ కూడగట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *