mt_logo

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం కేసీఆర్

ముస్లింల పవిత్ర పండుగ రంజాన్(ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని, అలాగే మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని సీఎం పేర్కొన్నారు. గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక అని, లౌకిక వాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ, దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతి కోసం,రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, వారి సంక్షేమానికి ప్రతి ఏటా భారీగా నిధులు కేటాయించి, ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. షాదీ ముబారక్ పథకం ద్వారా ఆడ పిల్లల పెండ్లి ఖర్చుల కోసం 1 లక్ష 116 రూపాయల సాయం అందించి, ముస్లిం పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూత నందిస్తున్నదని సీఎం తెలిపారు. మైనారిటీ యువతకు ప్రత్యేక శిక్షణనిచ్చి, రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని అన్నారు. మైనారిటీ విద్యార్థులకు గురుకులాల ద్వారా అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందిస్తున్నదన్నారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ ద్వారా ముస్లిం విద్యార్థుల విదేశీ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తున్నదని తెలియజేసారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుందన్నారు. లౌకిక వాద విఘాత శక్తుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కటినంగా వ్యవహరిస్తుందని సీఎం పునరుద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *